Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!

Elvish Yadav

Elvish Yadav

Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్‌కు మరోసారి కష్టాలు మొదలయ్యాయి. ఈసారి ఏకంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా మారడం సంచలనం రేపుతోంది. ఎల్విష్‌కు ఆ గ్యాంగ్ నుంచి బెదిరింపు సందేశం వచ్చినట్లు తెలిసింది. రెండు రోజుల్లోగా 10 కోట్ల రూపాయల మేర ‘ఎక్స్టార్షన్ మనీ’ (వసూళ్లు) చెల్లించాలని, లేకపోతే కాల్చి చంపేస్తామని ఆ మెసేజ్‌లో హెచ్చరించారు. కేవలం ఎల్విష్‌కే కాకుండా, అతడి తండ్రికి సైతం ఇలాంటి బెదిరింపులే రావడం గమనార్హం.

ఈ పరిణామంతో ఎల్విష్ యాదవ్ వెంటనే స్పందించి గురుగ్రామ్‌లోని సెకటర్-56 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విదేశీ నంబర్ నుంచి వాట్సాప్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గతంలో కూడా ఎల్విష్ నివాసంపై కాల్పులు జరిగిన ఘటనలు ఉండటంతో, తాజా బెదిరింపులు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదివరకే ‘పాముల విషం’ సరఫరా కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు నుంచి సైతం మొట్టికాయలు తిన్న ఎల్విష్.. ఇప్పుడు ఈ గ్యాంగ్‌స్టర్ బెదిరింపుల ఉచ్చులో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది.