Site icon NTV Telugu

Global Investors Summit: ఏపీలో పెట్టుబడిదారుల సమ్మిట్‌.. మస్క్, కుక్‌లకు ఆహ్వానం..

Global Investors Summit

Global Investors Summit

Global Investors Summit: విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహ్వానితుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ, యాపిల్ సీఈవో టిమ్ కుక్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల ఉన్నారు. ఈ సమ్మిట్ మార్చి 3, 4 తేదీలలో వైజాగ్‌లో జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి 15 మంది కేంద్రమంత్రులు, 15 మంది ముఖ్యమంత్రులు, 44 మంది ప్రపంచ పారిశ్రామికవేత్తలు, 53 మంది భారతీయ పరిశ్రమల ప్రముఖులు, వివిధ దేశాల రాయబారులను ఆహ్వానిస్తున్నారు. పోర్ట్ సిటీలో జరగనున్న సమ్మిట్‌కు ఆహ్వానితుల జాబితాలో అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ బెజోస్, సామ్‌సంగ్ ఛైర్మన్, సీఈఓ ఓహ్-హ్యున్ క్వాన్ కూడా ఉన్నారు. ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆనంద్ మహీంద్రా, కుమార్ మంగళం బిర్లా, ఆది గోద్రెజ్, రిషద్ ప్రేమ్‌జీ, ఎన్.చంద్రశేఖరన్ వంటి భారతీయ వ్యాపారవేత్తలు ఆహ్వానించబడ్డారు.

ఈ కార్యక్రమానికి ముందు తన సందేశంలో.. భవిష్యత్తు కోసం సిద్ధమయ్యే లక్ష్యంతో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించబడుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమ్మిట్‌కు హాజరు కావాలని, మీ వ్యాపారం అభివృద్ధి చెందేందుకు తమతో కలిసి పనిచేయాలని అందరికీ ఆహ్వానం పలికారు. 2019 మేలో అధికారంలోకి వచ్చిన వెంటనే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ దేశాల నుంచి పెట్టుబడులు కోరుతూ విజయవాడలో దౌత్య కార్యక్రమాలను నిర్వహించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ప్రతి రంగంలో సమృద్ధి, పెట్టుబడిదారులకు అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని ప్రకటిస్తూ “అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్”ని పెద్ద ఎత్తున ప్రదర్శించాలని కోరుతోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్‌లో.. “2022లో ఏపీ ప్రభుత్వం రూ.1,26,750 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను క్లియర్ చేసింది, అందులో రూ. 81,000 కోట్లు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ల వైపు ఉన్నాయి. మార్చి 3, 4 తేదీల్లో వైజాగ్‌లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తర్వాత ఏపీ పుంజుకుంటుంది.” అని అన్నారు. రాబోయే పెట్టుబడుల కోసం నిర్దిష్ట లక్ష్యం నిర్ణయించబడనప్పటికీ.. వివిధ రంగాల్లో దాదాపు రూ.5-8 లక్షల కోట్ల రావొచ్చని అంచనా వేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఈవెంట్‌లో బిజినెస్-టు-బిజినెస్ (B2B), గవర్నమెంట్-టు-బిజినెస్ (G2B) సమావేశాలు, గ్లోబల్ లీడర్‌లకు అవకాశాలను ప్రదర్శించడానికి సెక్టార్-నిర్దిష్ట ప్లీనరీ సెషన్‌లు ఉంటాయి.

Cabinet Expansion: బడ్జెట్‌కు ముందే కేంద్ర మంత్రివర్గ విస్తరణ!.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం?

వ్యవసాయ-ఆహార ప్రాసెసింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, పెట్రోకెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, పునరుత్పాదక ఇంధనం, ఎంఎస్ఎంఈలు, టూరిజం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించినట్లు ఓ అధికారి తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి విధానంతో పాటు పంప్‌డ్‌ స్టోరేజీ పవర్‌, బల్క్‌ డ్రగ్‌ పార్కులు, రిటైల్‌ పార్కులు, ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, పునరుత్పాదక ఇంధన ఎగుమతి, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ వంటి రంగాలకు సంబంధించిన ప్రత్యేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందని చెప్పారు. సమ్మిట్‌ను ప్రచారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జర్మనీ (జనవరి 20-26), జపాన్ (జనవరి 25-27), దక్షిణ కొరియా (జనవరి 30-31) , అమెరికా(ఫిబ్రవరి 6-10)లలో రోడ్‌షోలు నిర్వహిస్తుంది. యూఏఈ, తైవాన్‌లలో కూడా రోడ్‌షోలు నిర్వహించబడతాయి, అయితే తేదీలు ఇంకా నిర్ణయించబడలేదు. భారతదేశంలో సమ్మిట్ రోడ్‌షో జనవరి 10-14 వరకు న్యూఢిల్లీలో, ఫిబ్రవరి 3న ముంబైలో నిర్వహించబడుతుంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో ఈవెంట్‌కు తేదీలు ఖరారు కాలేదు.

Exit mobile version