NTV Telugu Site icon

Elon Musk: డిగ్రీ లేకున్నా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవ్వొచ్చంటున్న మస్క్

Elon Musk

Elon Musk

Elon Musk: ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తన వినూత్న ఆలోచనలతో అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నియామక ప్రక్రియలో సంచలన మార్పులు చేసి, “ఎవ్రీథింగ్ యాప్” కోసం టాలెంట్ ఉన్న వ్యక్తులను ఆహ్వానించారు. ఈ నియామక ప్రక్రియలో డిగ్రీల అవసరం, గత అనుభవం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మీరు ఏ స్కూల్‌కు వెళ్లారో కూడా తెలపాల్సిన అవసరం లేదని.. కేవలం మీ కోడ్ చూపిస్తే చాలని మస్క్ తెలిపారు. మాములుగా, మస్క్ ప్రతిభకు పెద్ద పీట వేయడం కొత్తేమీ కాదు. 2014లోనే టెస్లాలో ఉద్యోగం పొందడానికి యూనివర్సిటీ డిగ్రీ అవసరం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. ప్రతిభావంతులైన వ్యక్తులు తమ నైపుణ్యాలను చూపిస్తే చాలు, ఫార్మల్ ఎడ్యుకేషన్ అవసరం లేదని మస్క్ నమ్ముతారు.

Also Read: Ind Vs Eng Series: ధనాధన్ ఇన్నింగ్స్‭లకు వేళాయే.. కోల్‌కతాకు చేరుకున్న టీమిండియా, ఇంగ్లండ్ ఆటగాళ్లు

నిజానికి మస్క్ చదువు విధానంపై తరచూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పటి విద్యా విధానం బట్టీ పట్టడంపైనే దృష్టి పెట్టి, నిజ జీవిత సమస్యలను పరిష్కరించగల నైపుణ్యాలను పెంపొందించడంలో విఫలమవుతోందని మస్క్ అభిప్రాయపడ్డారు. అందుకే తన కంపెనీలు టెస్లా, స్పేస్‌ఎక్స్ ఇప్పుడు X కూడా డిగ్రీల కంటే నైపుణ్యాలను గుర్తించి నియామకాలను చేపడతాయని మరోమారు తెలిపారు. ఈ నేపథ్యంలో Xను కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా కాకుండా.. పేమెంట్స్, మెసేజింగ్, ఈ-కామర్స్, మల్టీమీడియా వంటి అనేక సేవలను ఒకే వేదికగా అందించాలనేది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. చైనాలో బాగా ప్రాచుర్యం పొందిన వీచాట్ మాదిరిగా Xను గ్లోబల్ హబ్‌గా మార్చాలని ఆయన భావిస్తున్నారు.

Also Read: Mahesh Babu : 20 నిమిషాల వైల్డ్ ఫైర్ .. డూప్ లేకుండా మహేష్ బాబుతో షూట్‌కు జక్కన్న ప్లాన్?

2025 పూర్తి అయ్యే నాటికి X మనీ (పేమెంట్ సర్వీస్), X టీవీ (స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్) వంటి ఫీచర్లను ప్రవేశపెట్టే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే, 2024లో ప్రవేశపెట్టిన AI చాట్‌బాట్ గ్రోక్‌లో సరికొత్త మార్పులను తీసుకురానున్నారు. ఎలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, ఆయన తన వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. మొత్తానికి, ఎలాన్ మస్క్ మరోసారి తన ఆలోచనలతో పరిశ్రమల రూపు మారుస్తున్నారు. చర్చనీయాంశమైనా, ఆయన నిర్ణయాలు మాత్రం కొత్త ఆవిష్కరణలకు దారితీస్తున్నాయి.