NTV Telugu Site icon

Elephant : క్రికెట్, ఫుట్ బాల్ ఆడుతున్న ఏనుగు..

Elephant

Elephant

కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లాలోని కటీలు శ్రీ దుర్గపరమేశ్వరి ఆలయంలో ఉన్న ఓ ఏనుగు.. క్రికెట్, ఫుట్ బాల్ ఆడుతోంది. సొంతంగానే స్నానం కూడా చేస్తోంది. 36 ఏళ్ల వయసులో చలాకీగా ఆటలు ఆడుతుంది ఈ గజరాజు. 1994లో కటీలు ఆలయానికి ఈ ఏనుగును సిబ్బంది తీసుకువచ్చారు. ముద్దుగా మహాలక్ష్మీ అని పేరు కూడా పెట్టారు. గత ఎనిమిది నెలల నుంచి మహాలక్ష్మీ.. ఈ ఆటలు ఆడుతుందని అక్కడి సిబ్బంది పేర్కొన్నారు. ఫైరోజ్, అల్తాప్, ముజాహిద్ అనే ముగ్గురు యువకులు.. ఈ ఏనుగును సంరక్షిస్తూ, ఆటలు నేర్పిస్తున్నారు. రోజూ ఈ ఏనుగు రెండు గంటలకు పైగా ఫుట్ బాల్, క్రికెట్ ఆడుతుందని సిబ్బంది చెబుతున్నారు.

Also Read : PM Modi: మోదీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు.. 44 కేసులు నమోదు చేసిన పోలీసులు..

ఈ గజరాజు తానే సొంతంగా పైపుతో కూడా స్నానం చేస్తుందని కటీలు శ్రీ దుర్గపరమేశ్వరి ఆలయంలో అక్కడి సిబ్బంది వెల్లడించారు. రోజూ దేవుడి విగ్రహం ముందుకు వచ్చి గంట కొట్టి ప్రార్థన చేస్తుంది. ఉదయం ఏడు గంటలకు ఏనుగు స్నానం చేస్తోంది. 10.30 గంటలకు గడ్డి, అన్నం, బెల్లం, అరటి పండ్లు, దోసకాయలు తింటుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు జొన్న బాల్స్, 2.45కు ఆకుకూరలు ఆరగిస్తుంది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 6.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటుంది. రాత్రి గడ్డి, అరటి పండ్లు వంటివి భుజిస్తుంది. రోజుకు దాదాపు 250 కిలోల ఆహారాన్ని ఈ ఏనుగు లాగించేస్తోంది. ఆరు నెలలకొకసారి వైద్యులు దీనికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ఏనుగు క్రికెట్, ఫుట్ బాల్ ఆడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

Also Read : Kadapa Muslim Bhakthulu: దేవుని కడపలో ముస్లింల ఉగాది పూజలు