ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలకు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉందని.. న్యాయస్థానం తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర విద్యుత్, పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి ఆర్.కే సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో ఇవాళ వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. విద్యుత్ బకాయిల చెల్లింపుపై తెలంగాణకు ఆ రాష్ట్ర హైకోర్టులో అనుకూలంగా ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు.
Read Also: Karnataka: అమానుష ఘటన.. ప్రేమ పెళ్లి.. తల్లిని నగ్నంగా ఊరేగించిన బంధువులు
ఇక, రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఆంధ్రప్రదేశ్ జెన్‌కో ద్వారా తెలంగాణ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసింది. ఈ మేరకు తెలంగాణ చెల్లించాల్సిన 6756.92 కోట్ల రూపాయల బకాయిలను 30 రోజుల్లోగా చెల్లించాలని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 92 లోబడి కేంద్ర ప్రభుత్వం విద్యుత్ మంత్రిత్వ శాఖ 2022 ఆగస్టు 29న ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. ఏపీకి తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన 3441.78 కోట్ల రూపాయల అసలుతో పాటు 3315.14 కోట్లు లేట్ పేమెంట్ సర్‌చార్జీలు రూపంలో చెల్లించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.
Read Also: Bigg Boss 7 Telugu: శివాజీని పొగడ్తలతో ముంచేసిన బిగ్ బాస్.. విన్నర్ ఎవరంటే?
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం టీఎస్ హైకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2022 ఆగస్టు 29న ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై జారీ చేసిన ఆదేశాలను కొట్టేస్తూ హైకోర్టు 2023 అక్టోబర్ 19న తీర్పు వెలువరించిందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు.