NTV Telugu Site icon

Andhra Pradesh: పల్నాడులో కొనసాగుతున్న 144 సెక్షన్‌.. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత

Andhra Pradesh

Andhra Pradesh

Andhra Pradesh: ఏపీలో ఓట్ల లెక్కింపు కోసం ఈసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణలు, గొడవలు కారణంగా ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుటోంది. కౌంటింగ్ ప్రక్రియను పకడ్బంధీగా చేసేందుకు మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. కేంద్ర బలగాలతోపాటు స్థానిక పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాల్లో కూడా సీసీటీవీ, కేంద్ర బలగాలతో నిఘా ఏర్పాటు చేసింది. జిల్లాల్లో ఉన్న కౌంటింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. భద్రతా విషయంలో రాజీ ప్రసక్తే లేదని చెబుతున్నారు. కౌంటింగ్‌కు హాజరయ్యే సిబ్బందికి, అధికారులకు, కౌంటింగ్‌ ఏజెంట్లకు, నియోజకవర్గ అభ్యర్థులకు టిఫెన్, మంచినీళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అభ్యర్థులు తీసుకొచ్చే సెల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రిక్ గాడ్జెట్లు భద్ర పరిచేందుకు ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయనున్నారు.

పల్నాడులో 144 సెక్షన్‌
పల్నాడులో నేటికి 14 రోజులుగా 144 సెక్షన్ కొనసాగుతోంది. పల్నాడులో దాదాపు వ్యాపారాలు బంద్ అయ్యాయి. కొన్నిచోట్ల పాక్షికంగా మాత్రమే వ్యాపారాలు జరుగుతున్నాయి. మరోవైపు కౌంటింగ్‌ ప్రక్రియకు సమయం దగ్గర పడుతున్న తరుణం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. పల్నాడులోని అన్ని ముఖ్య నియోజకవర్గాల్లో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో కార్డెన్‌ సెర్చ్‌లు నిర్వహిస్తున్నారు. పల్నాడు భద్రత వ్యవహారాలను ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి, పల్నాడు ఎస్పీ మల్లిక గర్గ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Read Also: MLC Polling: ఎమ్మెల్సీ పోలింగ్ ఏర్పాట్లు.. అక్కడ భద్రత కట్టుదిట్టం..

అనంతపురం జిల్లాలో భారీ భద్రత
అనంతపురం జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కౌంటింగ్ రోజు పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతించనున్నారు. జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంకులో బాటిళ్లలో పెట్రోల్ పోయడంప్తె ఆంక్షలు విధించారు. బాణా సంచా విక్రయాలప్తె నిషేధం విధించడంతో పాటు అమ్మితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేశారు. జిల్లాకు ముగ్గురు స్పెషల్‌ పోలీసు అధికారులను నియమించారు.

కౌంటింగ్‌కు ఏర్పాటు
తిరుపతి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో ఓట్ల లెక్కింపుకు 1053 సిబ్బందిని నియమించారు. చిత్తూరులో ఎస్వీ సెట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపుకు దాదాపు 11 వందల మందిని నియమించారు. జిల్లాలో తొలి ఫలితం వచ్చేది నగరి నుంచి మొదలు కానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ తో పాటు మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు 14 , పార్లమెంట్ స్థానానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్క చంద్రగిరి కోసం 20 టేబుల్స్ ఏర్పాటు చేశారు. జిల్లాలో 60 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు మూడువేలమంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Read Also: Drinkers Hulchul: ఒకడు తాగి జనాల్ని గుద్దేస్తాడు..ఓ అమ్మాయి తాగేసి అరాచకం చేస్తుంది.!

మూడంచెల భద్రత
ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏలూరు జిల్లాలో భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏలూరు పార్లమెంటుకు సంబంధించి సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రత మధ్య ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయి. జూన్ 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ కోసం ముందస్తుగానే ఏర్పాట్లు పూర్తి చేయాలని లక్ష్యంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది.

పాస్‌లు ఉన్నవారికే అనుమతి..
తూర్పుగోదావరి జిల్లాలో ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లా ఎన్నికల యంత్రాంగానికి సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత కోరారు. లా అండ్ ఆర్డర్‌కు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కౌంటింగ్ ఏజెంట్స్ సమాచారం ముందస్తుగా అందజేయాలన్నారు. పాస్‌లు ఉన్నవారినే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. రాజానగరంలోన నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలోకి వాహనాలు అనుమతి లేదన్నారు. కౌంటింగ్ ఏజెంట్స్ కొరకు దివాన్ చెరువు తదితర ప్రాంతాల్లో షటిల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి జూన్ 6 వరకు అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్ధులు, వారి మద్దతు దారుల ద్వారా బాణసంచా వినియోగం, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. కౌంటింగ్ సందర్భంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని ఆమె ఆదేశించారు. కౌంటింగ్ కోసం ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 129 టేబుల్స్ ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత చెప్పారు.