Mizoram Assembly Polls: తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదశ్, ఛత్తీస్‌గఢ్‌లో కౌంటింగ్ ఫీవర్ ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పటికే విడతల వారీగా ఎన్నికలు జరగగా.. ఆదివారం కౌంటింగ్ జరుగనుంది. వాస్తవంగా ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు.. మిజోరంలో కూడా ఎన్నికలు జరిగాయి. ఆదివారం రోజే మిజోరం ఫలితాలు రావాల్సి ఉంది. ఆ రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియను ఒకరోజు వాయిదా వేసింది ఎలక్షన్ కమిషన్. సోమవారం రోజు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనుంది.
మిజోరంలో క్రిస్టియన్‌ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆదివారం రోజుకు అక్కడి ప్రజలు ప్రాముఖ్యతనిస్తారు. ఆ రోజు చర్చి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే.. తమ కమ్యూనిటీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో.. మిజోరంలో నవంబర్ 7న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని మార్చాలని కోరుతూ నిన్న అక్కడి ప్రజలు నిరసనలు తెలిపారు. మిజోరం NGO కోఆర్డినేషన్ కమిటీ, సెంట్రల్ యంగ్ మిజో అసోసియేషన్, మిజో జిరాలై పాల్ వంటి విద్యార్థి సంస్థలు ఆందోళనలు నిర్వహించాయి. డిసెంబర్ 3 ఆదివారం నుంచి కౌంటింగ్ తేదీని మార్చాలని ఎన్జీవోసీసీ చాలాసార్లు ఈసీకి విజ్ఞప్తి చేసింది.
మిజోరం ప్రజల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఈసీ.. కౌంటింగ్ తేదీని ఆదివారం నుంచి సోమవారానికి మార్చింది. మిగిలిన నాలుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో మాత్రం యథావిథిగా ఆదివారమే ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామని ఈసీ చెప్పింది. ఇక.. మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలుండగా.. నవంబర్ 7న పోలింగ్ జరిగింది. 80శాతం కంటే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.