ఏపీలో ఎన్నికల వేళ మరో కీలక అంశంపై చర్చ జరుగుతోంది. ఫించన్ల పంపిణీ దగ్గర పడుతుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికలకు ముందు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు ఫించన్లు అందజేసేవారు. కాని ఇటీవల ఎన్నికల సంఘం వాలంటీర్లపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. గత నెలలో కూడా ఫించన్ల పంపిణీలో వాలంటీర్లు పాల్గొనలేదు. ఫించన్ల పంపిణీకి సమయం దగ్గర పడుతుండటంతో తాజాగా ఈసీ(EC) ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కుదరదని సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. డీబీటీ(DBT) రూపంలో నేరుగా పింఛనుదారులకు చెల్లించాలని తెలిపింది. అయితే ఇంటింటి పెన్షన్ల పంపిణీకి సరిపడా సిబ్బంది లేరని సీఎస్ తెలిపారు. ఏప్రిల్‌లో చేపట్టినట్లు చేస్తామని వెల్లడించారు. పింఛన్లు సహా నగదు బదిలీ పథకాలకు సంబంధించి మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను ఈసీ గుర్తు చేసింది.
READ MORE: Ramam Raghavam: ధనరాజ్ డైరెక్టర్గా “రామం రాఘవం”.. ఆసక్తి రేకెత్తిస్తున్న టీజర్
వాలంటీర్ల వినియోగంపై ఈసీ కన్నేసింది. ఎట్టి పరిస్థితుల్లోను వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి వాడుకోవద్దని స్పష్టం చేసింది. పింఛన్ల పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలంది. ప్రభుత్వ సిబ్బందిని వినియోగించుకోవాలని సూచించింది. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్లు, వితంతువు, దివ్యాంగులను ఇబ్బంది పెట్టకుండా… వారికి ఇంటి వద్దే పింఛన్లు అందించాలని పేర్కొంది. ఏపీలో ఎన్నికల విధులకు అధికారులు చాలడం లేదు. పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అంగన్వాడీ సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని ఈసీ నిర్ణయించింది. అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఓపీఓ(OPO)లుగా నియమించాలని జల్లాల పరిధిలోని ఎన్నికల అధికారులకు ఆదేశించింది. వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఫారం-12డి జారీ గడువును మే 1 వరకు పొడిగించింది. ఈ మేరకు సీఈవో ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను తప్పక పాటించాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఈసీ స్పష్టం చేసింది.