Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..

Ebola

Ebola

Ebola: కాంగోలో ఎబోలా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటివరకు 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఎబోలా ప్రకోపాల్లో ఒకటిగా ఇది నమోదైంది. ఘనాలో బుధవారం జరిగిన ఆరోగ్య సదస్సులో ‘ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జీన్ కాసెయా మాట్లాడుతూ, ఇప్పటివరకు 1,031 మరణాలు నమోదైనట్లు అధికారికంగా ధృవీకరించారు. “అక్కడ ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు. మన వద్ద తగినన్ని వ్యాక్సిన్లు, మందులు, నిధులు లేకపోవడం వల్లే వారు మరణిస్తున్నారు” అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం, సోమవారం నాటికి 2,473 కేసులు నమోదయ్యాయి. వీరిలో కనీసం 737 మంది రోగులు ఐసోలేషన్‌లో లేదా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. అధికారికంగా నమోదైన గణాంకాల కంటే ఎబోలా వ్యాప్తి రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. మే 15 నుంచి ప్రారంభమైన ఈ మహమ్మారి వ్యాప్తి వేగాన్ని అందుకోవడంలో ఆరోగ్య శాఖ అధికారులు విఫలమవుతున్నారని తెలిపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగా నమోదువుతున్న కేసులలో 80% కేసులు ముందస్తుగా గుర్తించిన ఇన్ఫెక్షన్ చైన్ (బాధితుల సంబంధిత కాంటాక్ట్స్) బయటి నుంచే వస్తున్నాయి. అంటే, ఆరోగ్య అధికారులు ట్రాక్ చేయగలిగే వేగం కంటే కూడా ఈ వైరస్ చాలా వేగంగా సమాజంలోకి వ్యాపిస్తోందని ఇది స్పష్టం చేస్తోంది.

ఎబోలా అంటే ఏమిటి?
ఎబోలా అనేది తీవ్రమైన, అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది అరుదుగా సంభవించినప్పటికీ, అత్యంత ప్రాణాంతకమైనది. ఈ వైరస్ సోకిన వ్యక్తి శరీరం నుంచి వచ్చే రక్తం, వాంతులు, చెమట లేదా వీర్యం వంటి శారీరక ద్రవాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ప్రస్తుతం దీనికి పూర్తిస్థాయి కచ్చితమైన చికిత్స అందుబాటులో లేదు.