సిద్ధిపేటలో నిన్న డబుల్ బెడ్రూం రాలేదని మనస్తాపానికి గురై కలెక్టరేట్ సమీపంలో చీలసాగరం రమేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ రోజు రమేష్ స్వగ్రామం గజ్వేల్ మండలంలోని అహ్మదీపూర్ లో అంత్యక్రియలు జరుగుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో.. రమేష్ కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఇలాకాలో ప్రతినిత్యం ఏదో ఒక మూల దళితులు పేదవర్గాల వారు న్యాయం జరగడం లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఇలాంటి ఘటనలను నాయకులు పోలీసులతో బెదిరించి బయట పొక్కకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ధరణితో భూముల సమస్యలు పరిష్కారం కాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, సంక్షేమ పథకాలు రావాలంటే మా పార్టీలో ఉండాలని టీఆర్‌ఎస్ ఎమ్మేల్యేలు, మంత్రులు అనడం విడ్డూరమన్నారు.
Also Read : Prostitution : షాకింగ్.. అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. 14 వేల అమ్మాయిలకు విముక్తి..
కేసీఆర్ తెలంగాణ నీ అబ్బా జాగీర్ కాదు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడిపిస్తూ ప్రజలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలకు కారణం తెలంగాణ ప్రభుత్వమని,
కేసీఅర్ పంజాబ్, హర్యానా వెళ్లి రైతులకు చెక్కులు ఇవ్వడం కాదు నీ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం చేయు అంటూ ఆయన ధ్వజమెత్తారు. కేసీఅర్ మాటలను ప్రజలు నమ్మొద్దని, తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల మీద విచారణ జరిపి, వారికి వెంటనే 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.