తూర్పుగోదావరి జిల్లాలో శ్రీగంధం చెట్లను అక్రమంగా కొట్టుకుపోయి విక్రయిస్తున్న ముఠాను తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ కి చెందిన ముగ్గురు సంచార జీవనం గడిపే యువకులు ఈ అక్రమ రవాణా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారు ముగ్గురినీ అరెస్టు చేశారు. రాజానగరం, కోరుకొండ మండలాల్లో మూడు చోట్ల శ్రీగంధం చెట్లను నరికి తరలిస్తుండగా.. పోలీసులకు అందిన సమాచారంతో రంగంలోకి దిగినట్లు రాజానగరం సీఐ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ తెలిపారు. ఎస్సై ప్రేమ్ కుమార్, సిబ్బంది లతో కలసి, డ్రోన్ కెమెరాల సాయంతో నిఘా పెట్టి ముగ్గురు నిందితులనూ అరెస్ట్ చేశామన్నారు.
రాజనగరం పోలీస్ స్టేషన్లో సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ మాట్లాడుతూ… ‘ఆగస్టు 29వ తేదీన రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో నందరాడ గ్రామంలో తన్నీరు విజయ్ కుమార్ కి చెందిన తోటలో గుర్తుతెలియని వ్యక్తులు మూడు శ్రీగంధం చెట్లు నరుక్కుని వెళ్లిపోయారని రైతు పిర్యాదు చేశారు. అదే పొలంలో ఈ నెల 19వ తారీఖున మరో రెండు శ్రీగంధం చెట్లును నర్కుపోయారు. దీనితో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్, నార్త్ జోన్ డిఎస్పి శ్రీకాంత్ ఆదేశాలతో దర్యాప్తు చేపట్టాం. డ్రోన్ ద్వారా తనికీలు ముమ్మరం చేశాం. అనుమానితుల్ని సర్వే లెన్స్ చేస్తున్న క్రమంలో దివాన్ చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి జీరో పాయింట్ దగ్గర కొందరు వ్యక్తులు అనుమానంగా కనిపించారు. ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని విచారించాం. వారి స్టేట్మెంట్ ఆధారంగా 53 శ్రీగంధం చెట్ల దుంగలను రికవరీ చేశాం’ అని తెలిపారు.
‘దుండగులు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాట్నీ జిల్లా సుకుమన్ గ్రామానికి చెందిన వాళ్లుగా గుర్తించాం. వీళ్లను రాజు అనే ఒక వ్యక్తి ఇక్కడకు తీసుకువచ్చి, చుట్టుపక్కల పొలాలను అన్నిటిని రెక్కీ చేసుకొన్నారు. శ్రీగంధం చెట్లను వాళ్లకి చూపించి వెళ్లిపోయాడు. రాత్రులు రంపం బ్లేడ్ లతో కోసి, బెరడు చెక్కి దాచి.. తర్వాత తీసుకురావడం చేశారు. రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు చెట్లనే కాకుండా, కోరుకొండ లిమిట్స్ లో దోసకాయలపల్లిలో కూడా ఒక పొలంలో ఒక చెట్టు దొంగతనం చేశారు. అది కూడా ఈ కేసులో రికవరీ అయింది. మొత్తం వాళ్ళ దగ్గర నుంచి సుమారు పది లక్షల రూపాయల విలువ చేసే శ్రీగంధం ముక్కలను రికవరీ చేసాం. ఈ ముగ్గురు ముద్దాయిలని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించాము. వీళ్లది సంచార జీవితం. పది రోజులు ఒక్క ప్రాంతం, మరో పది రోజులకు వేరే చోట క్యాంప్ వేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. వీరితో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ చెందిన రాజు అనే వ్యక్తి ఈ చోరీలు చేయిస్తున్నాడు. అతడిపై గతంలో ఏలూరు పోలీసులు స్టేషన్లో కేసులు ఉన్నాయి. ఇక్కడ కూడా కేసు నమోదు చేశాం, అతడు పరారీలో ఉన్నాడు’ అని సీఐ చెప్పారు.