NTV Telugu Site icon

Delhi Storm: ఢిల్లీలో దుమ్ము తుఫాన్.. నిలిచిన విమాన రాకపోకలు

Delhi Dust Storm 1

Delhi Dust Storm 1

ప్రపంచంలోని కాలుష్య న‌గ‌రాల్లో టాప్ స్థానంలో ఉన్న ఢిల్లీని తాజాగా దుమ్ము తుఫాను చుట్టిముట్టింది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన రాజ‌ధాని న‌గ‌రం ఇప్పుడు దుమ్ము తుఫానుతో భ‌యాందోళ‌న‌లు క‌లిగిస్తుంది. తీవ్రమైన‌ దుమ్ము తుఫాను, బలమైన గాలులు దేశ రాజధానిని తాకడంతో ఢిల్లీ వాతావరణంలో పెను మార్పు సంభ‌వించింది. శుక్రవారం దుమ్ము తుఫాను దేశరాజధాని ఢిల్లీ – ఎన్‌సీఆర్‌ ప్రాంతాన్ని కుదిపేసింది. ఇద్దరు మృతి చెందగా.. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో జనజీవనం స్తంభించింది.

READ MORE: MS Dhoni: స్టేడియంలోకి దూసుకొచ్చిన ధోని అభిమాని.. ఆటపట్టించిన ఎంఎస్‌డీ

ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడంతో చెట్లు కూలాయంటూ.. 152 కాల్స్‌ వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ తుఫాను కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ నిలిచిపోయింది. ఉరుములు, ఈదురు గాలులకు నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి రాకపోకలు సాగించే సుమారు తొమ్మిది విమానాలను జైపూర్‌కు దారి మళ్లించారు. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. చాలా భవనాలు దెబ్బతిన్నాయి. మరోవైపు దుమ్ము తుఫాను కారణంగా చెట్లు, గోడ కూలిన ఘటనల్లో సుమారు ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 23 మంది గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పలువురు సిబ్బంది శనివారం విరిగిన చెట్లు, భవనాల శిథిలాలను తొలగించారు.