Duplicate MRO: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్‌చల్ కలకలం రేపుతోంది. ప్రతిరోజూ ఎవరో ఒకరు నకిలీ ఉద్యోగిగా సెక్రటేరియట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో నకిలీ తహసీల్దార్‌ను సెక్రటేరియట్ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. కోమ్పల్లి ప్రాంతానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి తాను తహసీల్దార్‌గా పని చేస్తున్నట్లు పేర్కొంటూ నకిలీ ఐడీతో సచివాలయంలోకి ప్రవేశించాడు. తహసీల్దార్ స్టిక్కర్‌తో వాహనంలో వచ్చిన అతడిపై అనుమానం వచ్చి సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆపై సైఫాబాద్ పోలీసులకు అప్పగించిన అనంతరం విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. అంజయ్య ఫేక్ ఐడీ కార్డు జిరాక్స్ సెంటర్‌లో తయారు చేసుకుని తహసీల్దార్‌గా వేషధారణ చేశాడని పోలీసులు గుర్తించారు. అతను సచివాలయంలోని మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీల చాంబర్లలో తిరుగుతూ అనుమానాస్పద ప్రవర్తన చూపించేవాడని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఇదే తీరు కొనసాగడంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిపై నిఘా పెట్టారు.
Also Read: Guntur: గుంటూరు జిల్లాలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. 59 వెహికల్స్ సీజ్!
వివరాల్లోకి వెళ్లిన పోలీసులు, అంజయ్య సెక్రటేరియట్‌లో నకిలీ ఐడీతో దందాలు చేస్తున్నట్లు గుర్తించారు. తహసీల్దార్ స్టిక్కర్ ఉన్న కారులో సెక్రటేరియట్ ఆవరణలోకి ప్రవేశించి అక్కడ అధికారులుగా నటిస్తూ కొన్ని పనులు సాగించినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అతని పన్నాగం బయటపడింది. గత రెండు రోజుల క్రితం కూడా మరో నకిలీ ఉద్యోగి సెక్రటేరియట్ సిబ్బందికి చిక్కాడు. అప్పటి పరిణామాలు మరువక ముందే మరో నకిలీ వ్యక్తి పట్టుబడటం సెక్రటేరియట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ సెక్యూరిటీ సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. రోజుకు సుమారు 5 వేల మందికి పైగా సెక్రటేరియట్‌కు రావడంతో ప్రతి ఒక్కరి ఐడీ కార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
నకిలీ ఐడీలతో సెక్రటేరియట్‌లోకి ప్రవేశించే ప్రయత్నాలు ఎవరు చేసినా కఠిన చర్యలు తప్పవని సెక్యూరిటీ సిబ్బంది స్పష్టం చేశారు. నకిలీ ఉద్యోగులపై నిఘా మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నకిలీ ఐడీలతో సచివాలయంలోకి రానివ్వబోమని, ఎలాంటి పరిస్థితుల్లోనూ మినహాయింపు ఉండదని హెచ్చరించారు. ప్రస్తుతం సైఫాబాద్ పోలీసులు అంజయ్యపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అతడు ఇంతకాలం ఎలాంటి దందాలు నిర్వహించాడో, నకిలీ ఐడీలతో ఇంకెవరైనా ఉన్నారన్న కోణంలో పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలతో సచివాలయంలో భద్రతా చర్యలు మరింత పటిష్టం చేయాలని అధికారులు నిర్ణయించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.