NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : ధాన్య సేకరణ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తాం

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశం అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయం, విద్య, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయాలని మా ప్రభుత్వ ఉద్దేశ్యమని, ధాన్య సేకరణ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఒక్క గింజ తరుగు లేకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా త్వరగా కొనుగోలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు. విద్య పై క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించిందన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు.

అంతేకాకుండా..’విద్యా వ్యవస్థలో మా మార్క్ చూపిస్తాం. రాబోయే కాలంలో గొప్ప మానవ వనరులు సృష్టిస్తాము. అమ్మ పాఠశాల కమిటీ, మౌలిక సదుపాయాల కోసం 600 కోట్లు విడుదల చేస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వం పాఠశాలలు గొప్పగా ఉండాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. జూన్ 12 లోపు పాఠశాలల మౌలిక సదుపాయాలు, వసతులు కల్పిస్తాము. 2019లోనే మెడిగడ్డ బ్యారేజ్ వైఫల్యాలు మొదలైనాయని ndsa మధ్యంతర నివేదిక ఇచ్చింది. నీటిని పూర్తి స్థాయిలో వదిలేయాలని.. లేదంటే బ్యారేజ్ పూర్తి స్థాయిలో ప్రమాదం జరుగుతుంది. ఏ ప్రత్యామ్నాయ మార్గాలను చూసినా బ్యారేజ్ నిలుస్తుందని మేము నమ్మకం ఇవ్వలేమని ndsa నివేదిక లో ఉంది. జియో ఫిజికల్, జియో టెక్నీకల్ రిపోర్టులు వచ్చిన వెంటనే వేగవంతం పనులు చేస్తాం. రైతు ప్రయోజనాలే మాకు ముఖ్యం. సాంకేతిక నిపుణులు ఏది చెబితే అది చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ప్రజా ధనం దుర్వినియోగం కావొద్దని మా ప్రభుత్వ ఉద్దేశ్యం.’ అని శ్రీధర్‌ బాబు తెలిపారు.