Site icon NTV Telugu

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ హాట్‌ కామెంట్లు.. నేను అర్హుడిని కాదా..?

Raghunandan Rao

Raghunandan Rao

Raghunandan Rao: తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతుంది..! ఏమో జరగబోతోంది..! అధ్యక్షుడిని మార్చేస్తారు..! ప్రస్తుత అధ్యక్షుడిని సెంట్రల్‌లో ఉపయోగించుకుంటారు..! ఇలా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.. కొంతమంది కీలక నేతలు అలకబూనారు..! పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు..! ఇంతకీ బీజేపీలో ఉంటారా? మరో పార్టీలో చేరతారా? అనే చర్చ కూడా సాగుతోంది.. అలాంటి వ్యక్తుల్లో బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఒకరు.. అయితే, ఢిల్లీలో ప్రత్యక్షమైన ఆయన.. బీజేపీలో పరిస్థితులపై హాట్‌ కామెంట్లు చేశారు.. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాల్సిందే అనే తరహాలో.. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్.. లేదంటే జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వండి అంటూ స్పష్టం చేశారు.

Read Also: Telugu Movies this week: ఈ వారం సినీ లవర్స్‌కి పండగే ఏకంగా 34 రిలీజులు

తాను పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా, నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాదు? అని ప్రశ్నించారు రఘునందన్‌.. కొన్ని విషయాల్లో నా కులమే నాకు శాపం కావచ్చు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందన్నారు.. రెండో సారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యే గా గెలుస్తా అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నేను పార్టీలో ఉండాలని అనుకుంటున్నా అని స్పష్టం చేశారు.. 100 కోట్లు ఖర్చుపెట్టినా మునుగోడులో గెలవలేదు.. అదే 100 కోట్లు నాకిస్తే తెలంగాణను దున్నేసేవాణ్ణి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో నన్ను చూసే గెలిపించారు.. కేసీఆర్‌ను కొట్టె మొగోణ్ణి నేనేనని జనాలు నమ్మారని.. అంతేకాని బీజేపీని చూసి కాదు అంటూ తేల్చేశారు.

Read Also: Tomato Price: రోజురోజుకు పెరుగుతున్న టమాటా ధరలు.. ఇప్పుడు కేజీ 120 కాదు 160..!

నాకంటే ముందు దుబ్బాకలో బీజేపీ పోటీచేస్తే వచ్చింది 3500 ఓట్లు మాత్రమేనని గుర్తుచేశారు రఘునందన్‌.. ఇక, బండి సంజయ్ ది స్వయం కృతాపారాధం అంటూ హాట్‌ కామెంట్లు చేశారు.. పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీచేసిన సంజయ్ కి వంద కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడిది? అని నిలదీశారు.. పార్టీ డబ్బులో నాకు వాటా ఉంది. పేపర్ ప్రకటనలో తరుణ్ చూగ్, సునీల్ బన్సల్ ల బొమ్మలు కాదు రఘునందన్, ఈటల రాజేందర్‌ బొమ్మలుంటే ఓట్లు వేస్తారు. పార్టీ గుర్తు చివరి అంశమే అన్నారు. GHMC ప్లోర్ లీడర్ కావాలని అడిగిఅడిగి దేవర కర్నాకర్ చనిపోయాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీకి శాసన సభపక్ష నేత లేడనే విషయం జేపీ నడ్డాకు తెలియదన్న ఆయన.. నేను గెలిచినందుకే ఈటల రాజేందర్‌ పార్టీలోకి వచ్చారన్నారు.. బండి సంజయ్ మార్పుపై అడిగితే.. మీడియాలో వస్తున్నవన్నీ నిజాలే అన్నారు రఘునందన్‌.. ఇక, పదేళ్లలో పార్టీకోసం నాకంటే ఎక్కువ ఎవరు కష్టపడలేదని చెప్పుకొచ్చారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు. కాగా, గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు రఘునందన్‌.. ఈ మధ్యే.. ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా హస్తిన వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు.. తాము చెప్పాల్సిందంతా చెప్పామని స్పష్టం చేశారు. మరోవైపు సీయర్ నేతలు సోషల్‌ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు కూడా పార్టీలో హీట్‌ పెంచాయి.. ఈ తరుణంలో బీజేపీ కేంద్ర నాయకత్వం.. తెలంగాణ పార్టీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version