NTV Telugu Site icon

Marriage: మద్యం మత్తులో మండపానికి వెళ్లడం మర్చిపోయిన పెళ్లికొడుకు.. చివరకు!

Wedding

Wedding

Marriage: పెళ్లి కాబోతోందనే సంతోషంతోనో స్నేహితులు బలవంతపెట్టారనో.. కారణమేంటో కానీ కాసేపట్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో ఏకంగా తన పెళ్లి విషయాన్నే మరిచిపోయాడు. ముహూర్త సమయానికి పెళ్లి మండపానికి వెళ్లకుండా ఆలస్యంగా తూలుకుంటూ మ్యారేజ్ హాల్‌కు చేరుకున్నాడు. దీంతో వరుడి కోసం మండపంలో ఎదురుచూసి వధువు ఏకంగా వివాహాన్నే రద్దు చేసుకుంది. బీహార్‌లోని భాగల్‌పూర్‌ ప్రాంతానికి చెందిన మియాన్‌ అనే యువకుడికి సుల్తాన్‌గంజ్ గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో కుటుంబసభ్యులు పెళ్లి నిశ్చయించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం వారి వివాహ ముహుర్తాన్ని పెద్దలు ఖరారు చేశారు.

Read Also: Bhatti Vikramarka: దేశం, రాష్ట్రం బాగుపడాలంటే.. బీజేపీ, బీఆర్ఎస్‌ను బంగాళాఖాతంలో వేద్దాం

ఈ నేపథ్యంలో వరుడి కంటే ముందే వివాహ మండపానికి చేరుకున్న వధువు అతడి రాక కోసం ఎదురుచూసింది. ముహూర్త సమయం దాటినా పెళ్లికొడుకు రాకపోవడంతో వధువు కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. వరుడు ఊరేగింపుగా మండపానికి రావాల్సి ఉంది. కానీ అతడు ఊరేగింపు రాలేదు. ఉదయం రావాల్సిన వరుడు మహూర్తం దాటిపోయిన తర్వాత మధ్యాహ్న సమయంలో మద్యం సేవించి తూలుతూ మండపానికి వచ్చాడు. ఇది గమనించిన వధువు నాకీ పెళ్లి వద్దు బాబోయ్ అంటూ తెగేసి చెప్పేసింది. పెళ్లికి ముందే ఇలా ఉంటే పెళ్లయిన తర్వాత తన పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ పెళ్లికి నిరాకరించింది. దీంతో పెళ్లిపీటల దాకా వచ్చిన పెళ్లి రద్దయింది.

Show comments