NTV Telugu Site icon

Drone Attack In Sudan: సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో డ్రోన్ దాడి.. 40 మంది మృతి

Drone Attack

Drone Attack

Drone Attack In Sudan: సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ దళం (RSAF) మధ్య ఘర్షణల నేపథ్యంలో ఆదివారం రాజధాని ఖార్టూమ్‌లోని మార్కెట్‌లో డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది చనిపోయారు. దాదాపు 36 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం గాయపడిన వారందరినీ సూడాన్‌లోని బషీర్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆదివారం నాటి డ్రోన్ దాడి వెనుక ఏ గ్రూపు హస్తం ఉందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏప్రిల్ 15న సూడాన్‌లో ప్రారంభమైన అంతర్యుద్ధం తర్వాత పౌరుల మరణాల సంఖ్య ఇదే అత్యధికం. ప్రస్తుతం నివాస ప్రాంతాలపై దాడి పరిధి పెరుగుతోంది. ఇక్కడ అధికారం కోసం సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య ఏప్రిల్ నుంచి పోరాటం సాగుతోంది.

Also Read: Justin Trudeau: కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాదంపై జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు

ఆగస్టు నాటి యూఎన్‌ గణాంకాల ప్రకారం సైన్యం, పారామిలిటరీ దళం మధ్య జరిగిన ఘర్షణల్లో 4,000 మందికి పైగా మరణించారు. అంతర్యుద్ధం కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. హింస కారణంగా దాదాపు 71 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టారు. 11 లక్షల మంది ప్రజలు విదేశాల్లో ఆశ్రయం పొందగా, లక్షలాది మంది దేశంలోనే ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ ఏజెన్సీ ప్రకారం, ఏప్రిల్ నుంచి ప్రారంభమైన అంతర్యుద్ధం కారణంగా సూడాన్‌లో పరిస్థితి మరింత దిగజారింది. ఏప్రిల్ నుంచి శరణార్థుల సంఖ్య కూడా పెరిగింది. ఈ సంఖ్య 7.1 మిలియన్లకు చేరుకుంది. 1.1 మిలియన్ల మంది శరణార్థులు పొరుగు దేశాలలో ఆశ్రయం పొందారు.