Aryaveer Kohli and Aryaveer Sehwag Attract Bids in DPL 2025 Auctionఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025 వేలంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అన్న వికాస్ కోహ్లీ కుమారుడు ఆర్యవీర్ కోహ్లీ పాల్గొన్నాడు. ఆర్యవీర్ కోహ్లీని సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ రూ.1 లక్షకు కొనుగోలు చేసింది. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్‌ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రూ.8 లక్షల భారీ ధరకు కైవసం చేసుకుంది. వికాస్, సెహ్వాగ్ కుమారులు డీపీఎల్ 2025 వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరి పేరు ఆర్యవీర్ కావడం ఇక్కడ విశేషం.
వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ ఢిల్లీ అండర్ 19-క్రికెట్ జట్టులో భాగం. ఇటీవల ఢిల్లీ అండర్-19కి ప్రాతినిధ్యం వహించి మేఘాలయపై 297 రన్స్ చేశాడు. 18 ఏళ్ల ఆర్యవీర్ కూడా తండ్రి లాగే ఓపెనర్. భారీ ధర పలికిన ఆర్యవీర్ ఎలా ఆడుతాడో చూడాలి. ఇక వికాస్ కోహ్లీ కుమారుడు ఆర్యవీర్ లెగ్ స్పిన్నర్. ఆర్యవీర్ ప్రస్తుతం విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. ఆయుష్ బదోని నాయకత్వంలో ఆర్యవీర్ కోహ్లీ ఆడనున్నాడు.
డీపీఎల్ 2025 వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పేసర్ సిమర్జీత్ సింగ్ నిలిచాడు. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఈ ఫాస్ట్ బౌలర్‌ను రూ.39 లక్షలకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2025లో సిమర్జీత్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తరఫున ఆడాడు. మిస్టరీ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాఠీ రెండవ అత్యధిక బిడ్ అందుకున్నాడు. అతడిని సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ రూ.38 లక్షలకు కొనుగోలు చేసింది. 2024 ఎడిషన్ సెమీ-ఫైనలిస్ట్ పురానీ ఢిల్లీ 6 టీమ్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్‌ను అట్టిపెట్టుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వేలానికి ముందు మార్క్యూ ప్లేయర్‌గా నిలుపుకుంది.