Donald Trump: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. ఒకవేళ వాషింగ్టన్ సైనిక చర్యకు దిగాల్సి వస్తే గనుక ఇకపై ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనే దేశమే ఉనికిలో ఉండదు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ లక్ష్యాలపై అమెరికా వరుసగా రెండో రోజు కూడా వైమానిక దాడులు నిర్వహించిన అనంతరం ట్రంప్ శనివారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ (Truth Social) వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని (Ceasefire Agreement) టెహ్రాన్ పదే పదే ఉల్లంఘిస్తోందని ఆరోపించిన ట్రంప్.. అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్‌కు చెందిన క్షిపణులు, డ్రోన్ నిల్వ కేంద్రాలతో పాటు తీరప్రాంత రాడార్ స్థావరాలపై మెరుపు దాడులు జరిపినట్లు ప్రకటించారు. ఒకానొక దశలో తాము శాంతియుతంగా ఉండలేమని, ఈ ఏడాది ఆరంభంలో తాము విజయవంతంగా ప్రారంభించిన పనిని సైనిక పరంగా పూర్తిగా ముగించాల్సి వస్తుందని, అదే గనుక జరిగితే ఇరాన్ అనే దేశమే అంతమైపోతుందని ఘాటుగా హెచ్చరించారు.
హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ‘ఎమ్/టి కికు’ (M/T Kiku) అనే చమురు ట్యాంకర్‌పై ఇరాన్ వన్-వే అటాక్ డ్రోన్‌తో దాడి చేయడంతో యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ తాజా దాడులను చేపట్టింది. దాదాపు 20 లక్షల బారెళ్ల ముడి చమురుతో వెళ్తున్న ఆ నౌకపై ఇరాన్ దాడికి తెగబడటంతో ఒక్కసారిగా అమెరికా రెచ్చిపోయింది. శనివారం జరిపిన ఆపరేషన్‌లో ఇరాన్ నిఘా మౌలిక సదుపాయాలు, సమాచార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్‌లేయర్ సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున దాడులు చేసింది. అంతకుముందు శుక్రవారం కూడా ఒక వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేసిందనే ఆరోపణలతో అమెరికా మొదటి విడత దాడులు నిర్వహించింది. ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరు దేశాల మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం (MOU) కుదిరిన తర్వాత అమెరికా నేరుగా ఇరాన్‌పై సైనిక చర్యకు దిగడం ఇదే మొదటిసారి. శుక్రవారం నాటి దాడులకు కొన్ని గంటల ముందే, విలేకరులు అమెరికా స్పందన గురించి అడగ్గా.. “మీకే త్వరలో తెలుస్తుంది” అంటూ ట్రంప్ ముందస్తు సంకేతాలు ఇచ్చారు. మరోవైపు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ (JD Vance) సైతం ఈ సైనిక చర్యను గట్టిగా సమర్థిస్తూ ఇరాన్‌ను హెచ్చరించారు. “ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసింది, మేము దానిని గౌరవించాము. ఈ ఒప్పందం (MOU) అమలుపై వారికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫోన్ చేసి మాట్లాడవచ్చు, అంతే కానీ హింసకు దిగితే హింసతోనే సమాధానం చెప్తాం” అని వాన్స్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేశారు. ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఈ ఘర్షణ వాతావరణం నెలకొనడం వల్ల అంతర్జాతీయంగా చమురు ఎగుమతుల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కుదిరిన బలహీనమైన శాంతి ఒప్పందానికి ఈ తాజా బెదిరింపులు, పరస్పర దాడులు ఒక పెద్ద పరీక్షగా మారాయి.

