NTV Telugu Site icon

Dog shocks bride groom: పెళ్లి కొడుకుకు షాక్ ఇచ్చిన కుక్క.. ఎంతపని చేసిందంటే

Dog

Dog

Dog shocks bride groom: పెంపుడు జంతువులు చాలా సార్లు ఎంత నవ్వించే పనులు చేస్తాయో కొన్ని కొన్ని సార్లు ఏడిపిస్తూ ఉంటాయి కూడా. అవి చేసే పనులకు ఏం చేయాలో తెలియక తల పట్టుకొని కూర్చోవడం మనవంతు అవుతుంది. ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులే కొన్ని సార్లు మన ముఖ్యమైన పనులకు అడ్డంకిగా మారితే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి ఘటనే అమెరికాలోని ఓ యువకుడికి ఎదురయ్యింది. ఈ స్టోరీ తెలుసుకున్న వారు ఇఫ్పుడు ఆ వ్యక్తిపై జాలి చూపిస్తున్నారు. అసలేం జరిగిందంటే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి. తమ పెళ్లి జీవితాంతం గుర్తుండేలా ఆరోజు డిఫరెంట్ గా ఘనంగా చేసుకోవాలని అందరు భావిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. తమకు నచ్చిన ప్రదేశానికో, దేశానికో వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు. దాని కోసం ఎంత ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇక అలాగే తమ పెళ్లి కోసం డెస్టినేషన్ వెడ్డింగ్ ను ప్లాన్ చేసుకుంది ఓ జంట. అమెరికాకు చెందిన ఓ జంట  తమ పెళ్లి అంగరంగ వైభవంగా చేసుకోవాలని నిర్ణయించుకుంది.

Also Read: Chandrayaan 2 mission Mistakes : చంద్రయాన్-2 లో జరిగిన తప్పులు చంద్రయాన్-3లో జరిగే అవకాశం ఉన్నాయా?

అమెరికాకు చెందిన డొనాటో ఫ్రాట్టరోలి, మగ్దా మజ్రీకి ఇటీవలే పెళ్లి కుదిరింది. వారి పెళ్లి ఆగస్టు 31న జరిపించాలని నిర్ణయించారు. దీని కోసం ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. ఇక శుక్రవారం పెళ్లి బృందం ఇటలీ బయలుదేరేందుకు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం డొనాటో, మగ్దాలు పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసేందుకు సిటీ హాల్ కు వెళ్లారు. ఎంతో ఆనందంతో అక్కడి నుంచి ఇంటికి తిరిగొచ్చిన వారికి డొనాటో పెంపుడు కుక్క చిక్కీ షాకిచ్చింది.

వారు ఇంటికి చేరుకునే సమయానికి చిక్కీ పాస్ పోర్ట్ నములుతూ కనిపించింది. ఇది చూడగానే డొనాటోకు గుండె ఆగినంత పనైయ్యింది. వెంటనే కుక్క నోటిలో నుంచి ఆ పాస్ట్ పోర్ట్ ను లాక్కొని చూడగా అప్పటికే సగం పేజీను పరపరా నమిలేసింది చిక్కీ. ఇక ఇటలీ బయలు దేరే వారం రోజుల ముందు ఇలా జరగ్గా ఏం చేయాలో తెలియక వారు తలపట్టుకున్నారు. తరువాత బంధువులు, స్నేహితులు ఇచ్చిన సలహాతో స్థానిక అధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు డొనాటో. అతని బాధను అర్థం చేసుకున్న అధికారులు వీలైనంత త్వరగా కొత్త పాస్ పోర్ట్ జారీ చేసే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో డొనాటో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక టికెట్స్ బుక్ చేసుకున్న ప్రకారం పెళ్లి బృందం శుక్రవారం ఇటలీకి బయలుదేరనుంది. ఆ లోపు కొత్త పాస్ పోర్ట్ వస్తే వారితో కలిసి ఫ్లైట్ ఎక్కుతానని డొనాటో తెలిపాడు. లేనిపక్షంలో ఇటలీ నుంచి తిరిగొచ్చిన వారికి స్వాగతం చెప్పేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్తానని పెళ్లికొడుకు డినాటో అంటున్నాడు. అయితే తెలివిలేని మూగజీవి చేసిన తప్పుకు డొనాటో పెళ్లి కోరిక తీరకుండా పోకూడదని అతనికి వెంటనే పాస్ పోర్టు రావాలని ఈ వార్త తెలిసిన వారు కోరుకుంటున్నారు.