ఆ దేవుడి తరువాత జనం దండంపెట్టి కోరుకునేది వైద్యులకే. నేటి సమాజంలో వైద్యుల స్థానం అంత ప్రాముఖ్యమైంది. అయితే.. కొందరు వైద్యులు చేస్తున్న విశేష కృషి ఆ స్థానాన్ని మరింత పెంచుతోంది. కుండపోతలా వర్షం కురుస్తున్నా.. ప్రసవం చేసే రూంలో పైకప్పు నుంచి నీళ్లు పడుతున్నా లెక్కచేయకుండా.. వైద్యం కోసం వచ్చిన గర్భిణీకి సుఖప్రసవం చేశారు. ఈ ఘటన ఏపీలో చోటు చేసుకుంది.. ఏపీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అనకాపల్లి జిల్లాలోని దేవరపల్లి పీహెచ్‌సీకి ఓ 30 ఏళ్ల మహిళ ప్రసవ వేదనతో వచ్చింది. అయితే.. వెంటనే డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆమెకు ప్రసవం చేసేందుకు లేబర్ రూంకు తీసుకువెళ్లారు. అయితే.. గత కొన్ని రోజుల క్రితం దేవరపల్లి పీహెచ్‌సీ లేబర్ రూం పైకప్పు దెబ్బ తినడంతో మరమ్మతులు చేయించారు. అయితే.. పైకప్పు మరమ్మతుల చేసేందుకు వచ్చిన కాంట్రాక్టర్ పనిని సగంలోనే వదిలేశాడు.
దీంతో లేబర్ రూంలో పైకప్పు నుంచి వర్షపు నీరు పడుతోంది. అయినప్పటికీ.. నిబద్ధతతో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు నర్సులతో పాటు ఇతర సిబ్బంది సదరు గర్భిణీ స్ట్రీకి ప్రసవం చేసేందుకు నిర్ణయించుకున్నారు. లేబర్ రూంలో గర్భిణీని తీసుకువెళ్లారు.. అక్కడ ఇతర సిబ్బంది బకెట్లతో వర్షపు నీటిని పట్టుకొని పారేస్తుంటే.. డాక్టర్లు, నర్సులు గర్భిణీకి ప్రసవం చేశారు. దీంతో ఆ గర్భిణీ పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. అయితే.. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మహిళకు సాధారణ ప్రసవం జరిగేలా చూసిన పీహెచ్‌సీ సిబ్బందిపై స్థానికంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.