NTV Telugu Site icon

Raw Mango: పచ్చిమామిడి తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..!

Mango

Mango

ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడిపండ్లు మార్కెట్లలో నిగనిగ మెరుస్తూ ఉంటాయి. మామిడి పండ్లు అంటే చాలా మందికి ఇష్టమే.. మామిడిపండ్లు తియ్యగా ఉండటం వల్ల పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే మామిడిని ‘పండ్లలో రారాజు’ అని అంటారు. అయితే.. ఉగాది తర్వాత మామిడి పండ్లు మార్కెట్లోకి వస్తుంటాయి. ఇక సీజన్‌ ప్రారంభంలో ఎక్కువగా పచ్చిమామిడి కాయలు లభిస్తాయి. వాటితో చాలా మంది పచ్చడి తయారు చేసుకుంటారు. మరి కొంతమంది పచ్చికాయలను కోసి ఆ ముక్కలపై ఉప్పు, కారం చల్లుకుని తింటుంటారు. పచ్చిమామిడిలో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ పచ్చి మామిడికాయలు తింటే శరీరంలో జరిగే మార్పులేంటో తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది
పచ్చి మామిడిలో విటమిన్‌ ఇ, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతాయి. ఈ పండులో ఉండే విటమిన్‌ సి వల్ల జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

రక్తహీనతను తగ్గిస్తుంది
పచ్చి మామిడికాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే శరీరంలో రక్తం గడ్డకట్టకుండా ఆపుతుంది. అంతేకాకుండా.. హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరగడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 2017లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రక్తహీనతతో బాధపడుతున్న వారు రోజూ పచ్చి మామిడి కాయను తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగాయని పరిశోధకులు తెలిపారు.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది
పచ్చి మామిడికాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకోసమని.. ఇది రోజూ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా.. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయంట.

చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
పచ్చి మామిడిలో విటమిన్‌ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ముడతలు పడకుండా, మొటిమలు రాకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది.

చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి
పచ్చి మామిడి కాయలో ఉండే ఫైబర్‌ కంటెంట్‌.. రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్న వారు పచ్చి మామిడి కాయను తింటారు.

వెయిట్ లాస్
పచ్చి మామిడిలో తక్కువ క్యాలరీలు, ఫైబర్‌ ఎక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినడం వల్ల వెయిట్‌ లాస్‌ అవ్వచ్చు. అలాగే పచ్చి మామిడికాయను తినడం వల్ల కడుపు నిండినట్లుగా అనిపించి ఎక్కువగా తినకుండా ఉండవచ్చని చెబుతున్నారు.

గుండె ఆరోగ్యం
పచ్చి మామిడిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.

కంటి చూపు మెరుగుపడుతుంది
పచ్చి మామిడిలో ఎక్కువగా కెరోటినాయిడ్స్ ఉంటాయి. దాని వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది.

చిగుళ్ల నుంచి రక్తస్రావం
చిగుళ్ల నుంచి రక్తస్రావం అయ్యే వారు పచ్చిమామిడి తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.