దేశవ్యాప్తంగా ‘దీపావళి’ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. పూజలు, నోములు, దీపాలతో యావత్ దేశం ఘనంగా దీపావళి జరుపుకుంది. గురువారం రాత్రి అయితే పటాసుల పేలుళ్లతో దేశం మొత్తం మార్మోగిపోయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా బాణసంచాను కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఓ వింత ఆచారంను పాటించారు.
దోర్నాల మండలం వై.చర్లోపల్లిలో దీపావళి పండుగ సందర్భంగా ఓ వింత ఆచారాన్ని గ్రామస్తులు ఆనవాయితీగా నిర్వహించారు. దీపావళి నేపథ్యంలో గ్రామస్తులు అందరూ గ్రామంలోని ఆవులను ఓ చోటకు చేర్చి.. ప్రత్యేక పూజలు చేశారు. ఆపై టపాసులు పేలుస్తూ.. ఆవులను గ్రామంలో పరిగెత్తించారు. ఇలా చేయడం ద్వారా గ్రామానికి మేలు జరుగుతుందని చర్లోపల్లి గ్రామస్థులు నమ్ముతారు. ప్రతి దీపావళికి ఇలా ఆవులను పరిగెత్తించడం తమ పూర్వికుల నుంచి వస్తున్న ఆనవాయితీ అని గ్రామస్తులు చెబుతున్నారు.
Also Read: KA : తొలి రోజు అదరగొట్టిన కిరణ్ అబ్బవరం ‘క’..
మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పుర్ జిల్లా సమ్మూ గ్రామం దీపావళి పండుగకు ఎప్పుడూ దూరంగా ఉంటుంది. ఓ మహిళ దీపావళి రోజు పుట్టింటికి బయలుదేరగా.. అదే సమయంలో రాజు ఆస్థానంలో పనిచేస్తున్న తన భర్త చనిపోయాడనే మరణవార్త వస్తుంది. గర్భిణి అయిన ఆ మహిళ బాధను భరించలేక.. భర్త చితిపై ఆత్మార్పణం చేసుకుంది. ఇకనుంచి ఊరి ప్రజలు దీపావళి చేసుకోవద్దని శాపం పెట్టిందట. దాంతో అప్పటి నుంచి ఆ ఊరిలో దీపావళి పండగను నిర్వహించడం లేదు. ఒకవేళ దీపావళి చేసుకుంటే.. ఏదో అపశకునం జరుగుతుందనే భయం ఆ ఊరి ప్రజల్లో నెలకొంది.