బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి వెలుపల కాల్పులు జరిగాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీలోని సివిల్ లైన్స్‌లోని ఉన్న దిశా పటానీ ఇంటి వెలుపల గురువారం అర్థరాత్రి పలు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో రెండు రౌండ్ల వైమానిక కాల్పులు జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దిశా సోదరి ఖుష్బూ పటాని సాధువులను అవమానించడంతోనే ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ.. ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్నారు.
ఈ సంఘటనకు తాము బాధ్యత వహిస్తున్నట్లు ఇద్దరు వ్యక్తులు (గోల్డీ బ్రార్ గ్యాంగ్) సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. వీరేంద్ర చరణ్, మహేంద్ర శరణ్ (దేలానా) అనే పేర్లతో హిందీలో లెటర్ రాశారు. ‘సోదరులారా.. ఈరోజు బరేలీలోని ఖుష్బూ పటాని/దిశా పటాని ఇంట్లో జరిగిన కాల్పులు మేమే చేశాం. ఆమె (ఖుష్బూ) మన గౌరవనీయులైన సాధువులు ప్రేమానంద్ జీ మహారాజ్, అనిరుద్ధాచార్య జీ మహారాజ్‌లను అవమానించింది. ఆమె మన సనాతన ధర్మాన్ని కించపరచడానికి ప్రయత్నించింది. మన సాధువులను అవమానించడం మేం సహించం. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. మరోసారి మన మతం పట్ల అగౌరవం చూపిస్తే.. ఆమె ఇంట్లో ఎవరూ ప్రాణాలతో ఉండరు’ అని హెచ్చరించారు.
Also Read: Health Tips: వేరుశెనగలు, ఆవాలు, నువ్వులు.. ఏ నూనె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?
‘ఈ సందేశం కేవలం ఆమె కోసమే కాదు.. సినిమా పరిశ్రమలోని అందరికి. నటీనటులతో సంబంధం ఉన్నవారికి కూడా. భవిష్యత్తులో మన మతం, సాధువులకు వ్యతిరేకంగా ఎవరైనా ఇలాంటి అవమానకరమైన చర్యకు పాల్పడితే.. దాని పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మన మతాన్ని రక్షించుకోవడానికి మేము ఎంతకైనా తెగిస్తాం. మేము అస్సలు వెనక్కి తగ్గం. మా మతం, సమాజంను రక్షించడమే మా ప్రథమ కర్తవ్యం’ అని సోషల్ మీడియాలో పోస్టులో హెచ్చరించారు. కాల్పులు జరిపిన వారి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు ధృవీకరించారు.
