Bharat- Canada Dispute: భారత్- కెనడాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరుదేశాల మధ్య ఖలిస్తానీ చిచ్చు ఆరడం లేదు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బ తింటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కూడా వాయిదా పడ్డాయి. అక్టోబర్‌లో ఇరు దేశాల మధ్య జరగాల్సిన ట్రేడ్ మిషన్ వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్‌జి ప్రతినిధి శాంతి కోసెంటినో ధృవీకరించారు. కారణం లేకుండా ఈ చర్చల్ని వాయిదా వేశారు. ఈ నెల ప్రారంభంలో కూడా ఇలాగే కెనడా, భారత్ తో వాణిజ్య ఒప్పందానికి విరామం ఇచ్చింది. ఇక భారత్ పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకునే దేశాల్లో కెనడా ప్రధానమైనది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపధ్యంలో ఈ ప్రభావం పప్పుధాన్యాల దిగుమతిపై పడనుందని అనుకుంటున్నారు.
దీనిపై ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి క్లారిటీ ఇచ్చారు. ఇకపై పప్పు ధాన్యాల దిగుమతిపై భారత్ ఒకే దేశం పై ఆధారపడదని ఆయన పేర్కొన్నారు. కెనడా నుంచి వచ్చిన పప్పు ధాన్యాలు ఇప్పటికే చాలా వరకు భారత్ లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా పప్పు ధాన్యాల కొరత ఏర్పడే అవకాశం లేదని తెలిపారు. వీటికి తోడు ఇటీవల అమెరికా నుంచి కూడా కాయ ధాన్యాలను దిగుమతి చేసుకునేందుకు భారత్ సిద్ధమయ్యిందని వీటిపై కస్టమ్స్ సుంకం మినహాయింపు కూడా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 2022-23లో కెనడా నుంచి 11 లక్షల టన్నుల పప్పు ధాన్యాలను ఇండియా దిగుమతి చేసుకుంది. కెనడా ప్రధాన ఎగుమతి దారుల్లో భారత్ ఒకటి. ప్రస్తుతం వివాదాల నేపథ్యంలో భారత్ ఇతర దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. 023 ఏప్రిల్-జూన్ కాలంలో కెనడా నుండి భారతదేశం సుమారు 0.95 లక్షల టన్నుల కాయధాన్యాలను దిగుమతి చేసుకోగా, ఆస్ట్రేలియా నుంచి 1.99 లక్షల టన్నులను దిగుమతి చేసుకుంది. అంతేకాకుండా రష్యా, సింగపూర్, టర్కీ, యూఏఈ నుంచి కూడా భారతదేశం పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి కెనడాతో విభేదాల ప్రభావం పప్పు ధాన్యాలపై పడదనే చెప్పుకోవాలి.