Bombay Highcourt: ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో , విద్యా ఉపాధి అవకాశాల్లో తమకు ప్రత్యేక రిజర్వేషన్‌లు కల్పించాలని బాంబే కోర్టును ఆశ్రయించిన వినాయక్ కాశీద్ అనే పిటిషనర్ తరపున వాదనలు విన్న కోర్టు లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తులకు ప్రత్యేక రిజర్వేషన్‌లు కల్పించే అధికారం తమ పరిధిలో లేదని తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టులో ఉన్న సమస్యల వివరణ దృష్ట్యా విద్య, ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్‌జెండర్లకు అదనపు రిజర్వేషన్లు కల్పించడం కష్టమని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం బాంబే హైకోర్టుకు తెలియజేసింది. మహరాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ డాక్టర్ బీరేంద్ర సరాఫ్ ఇప్పటికే వివిధ కులాల, వర్గాల వారీగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్‌లు వర్తింపజేస్తున్నందున కొత్తగా అదనపు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని కోర్టుకు విన్నవించారు. హిజ్రాలు ఆయా వర్గాలకు చెందిన కేటగిరీల్లో రిజర్వేషన్‌లు పొందే అవకాశం ఉన్నందున కొత్తగా అదనపు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
Also Read: Viral News: విమానంలోకి పెద్ద పక్షి.. ఫైలట్ ముఖం నిండా రక్తం.. అయినా సరే..!
ఇప్పటికీ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు రూపొందించలేదని సరాఫ్ బాంబే హైకోర్టుకు విన్నవించారు. కాగా కర్ణాటకలో అన్ని కులాల్లో 1 శాతం అదనపు రిజర్వేషన్‌లు కల్పిస్తున్నారు కావున మహరాష్ట్రలో హిజ్రాలకు అదనపు రిజర్వేషన్ కల్పించడంలో సాధ్యాసాధ్యాలతో పనిలేదని పిటిషనర్ తరపు న్యాయవాది క్రాంతి కోర్టుకు విన్నవించారు. లింగమార్పిడి వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం 2019ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసిందని గుర్తు చేశారు. లింగ మార్పిడి వ్యక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్చి 3, 2023న కొన్ని తీర్మానాలు చేసిందని అంతే కాకుండా సామాజిక న్యాయ శాఖ ఆధ్వర్యంలో 14 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ అంశాన్ని పరిశీలిస్తుందని సరాఫ్ సమర్పించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం లింగ మార్పిడి వ్యక్తులకు, హిజ్రాలకు రిజర్వేషన్‌లు కల్పించడం తమ పరిధిలో లేదని, కమిటీ ముందు తమ అభిప్రాయాలు తెలియజేయాలని, ప్రభుత్వం విధి విధానాలు రూపొందించి, చట్ట పరిధిలోకి వచ్చినపుడు మాత్రమే కోర్టులు ఆదేశించగలవని తెలిపారు. ఈ విషయాన్ని కమిటీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ధర్మాసనం సూచించింది. లింగమార్పిడి వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తులను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని సంప్రదించాలని పిటిషనర్‌ను కోర్టు కోరింది.