NTV Telugu Site icon

Diarrhea Cases: కాకినాడ జిల్లాలో డయేరియా కలకలం.. ఇప్పటివరకు ఇద్దరు మృతి

Diarrhea

Diarrhea

Diarrhea Cases: ఏపీలోని పలు జిల్లాల్లో డయేరియా కలకలం సృష్టిస్తోంది. కాకినాడ జిల్లాలో డయేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు డయేరియా బాధితుల సంఖ్య 210కి చేరగా.. ఆస్పత్రుల నుంచి140 మంది డిశ్చార్జ్ అయ్యారు. డయేరియాతో కొమ్మనాపల్లికి చెందిన నాగమణి, వేట్లపాలెంకు చెందిన సత్యవతి అనే ఇద్దరు మహిళలు మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. డయేరియాకు కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. డీఎంహెచ్‌వో ఆఫీస్‌లో నిరంతరం మానిటరింగ్ చేసేలా హెల్ప్ లైన్ సెంటర్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. తొండంగి మండలం కొమ్మనాపల్లి, సామర్లకోట మండలం వేట్లపాలెంలో వైద్య బృందాలతో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. కలుషిత తాగునీటి సరఫరా, పైప్ లైన్‌లు లీకేజీలతో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు టెస్టింగ్‌కు పంపారు.

Read Also: Ram Prasad Reddy : ప్రమాద రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే నా లక్ష్యం.. మంత్రి రాం ప్రసాద్ రెడ్డి

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట జనాలను కూడా డయేరియా కలవరపెడుతోంది. ఇప్పటికే డయేరియా వల్ల ఒకరు చనిపోవడం, పెద్ద ఎత్తున కేసులు నమోదవ్వడంతో జనాలు వణికిపోతున్నారు. నియోజకవర్గంలోని 8 గ్రామాలకు డయేరియా పాకింది. దీంతో జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రి రోగులతో నిండిపోయింది. ఇక వెంటనే అప్రమత్తమైన అధికారులు రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 16 మంది వైద్యులు 24 గంటలపాటు సేవలు అందిస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా ప్రబలడంతో పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు ప్రజలు. నీరు రంగు మారిపోవడం, ఆ ప్రాంతంలో డ్రైనేజీ లోంచే మంచి నీటి పైప్ లైన్లు వెళ్ళడం ఆందోళనకు గురి చేస్తుంది. జగ్గయ్యపేటలో డయేరియా ప్రబలడానికి కారణం నీటి పంపు లైన్లు, పైపులు సరైన నిర్వహణ లేదని అంటున్నారు స్థానికులు. ఐదేళ్ళుగా కంప్లైంట్లు ఇస్తున్నా పట్టించుకోలేదని ఆరోపణలు కూడా వస్తున్నాయి.

డయేరియా విజృంభణపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తోంది. ర్షాకాల నేపథ్యంలో అంటురోగాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సర్కారు సూచిస్తోంది. ఇటీవల డయేరియా వ్యాధి కట్టడిపై అధికారులను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ నిలదీశారు. డయేరియా కట్టడిపై వివిధ శాఖల అధికారులతో సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు రక్షిత తాగునీరు అందించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. మంచినీటి పైపులైన్లు లీకేజీలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డయేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన ప్రణాళిక అమలు చేయాలని సీఎస్‌ ఆదేశించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని సీఎస్ ఆదేశించారు.

 

Show comments