DGP CV Anand: ఐటీ కారిడార్ అభివృద్ధి, భవిష్యత్తులో ఎదురయ్యే ట్రాఫిక్ సవాళ్లపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ‘సీక్రెట్ లేక్’గా పిలవబడే దుర్గం చెరువు శివారు ప్రాంతంలో ఉన్నట్లు ఉండేదని, అక్కడొక చెరువు ఉందన్న విషయం కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసేదని ఆయన గుర్తుచేశారు. తాను డీసీపీగా పనిచేసిన సమయంలో కేవలం సైబర్ టవర్స్ భవనం మాత్రమే ఉండేదని, కానీ నేడు ఆ ప్రాంతం ఎంతో విస్తరించి ఆకాశాన్ని తాకే భవనాలతో నిండిపోయిందని, సైబరాబాద్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. అయితే, ఇదే స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందిన బెంగళూరు నగరం ప్రస్తుతం తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటోందని, హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రాకూడదని డీజీపీ ఆకాంక్షించారు.
తాజాగా ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ సదస్సులో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. కంపెనీలు, ఉద్యోగాలన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావడం వల్ల రద్దీ పెరుగుతోందని అన్నారు. ప్రజలు ప్రజా రవాణాను (పబ్లిక్ ట్రాన్స్పోర్ట్) వినియోగించకుండా ఒక్కొక్కరు ఒక్కో కారు లేదా బైక్‌పై ఆఫీసులకు వస్తున్నారని, కారులో ఆఫీసుకు రావడాన్ని కొందరు స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే ట్రాఫిక్ సమస్య నరకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీస్ సిబ్బంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని డీజీపీ సూచించారు. కొత్త మార్పుల వల్ల ఒకటి రెండు రోజులు కొంత ఇబ్బంది ఎదురైనా, ఆ తర్వాత మంచి ఫలితాలు వస్తాయని భరోసా ఇచ్చారు. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని, ఇందుకు కార్పొరేట్ సంస్థలు, ఉద్యోగులు కూడా పూర్తిస్థాయిలో సహకరించాలని సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు.
ట్రాఫిక్ సమస్య మాత్రం సమాజంలోని 100 శాతం మందిని ప్రభావితం చేస్తోందని సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి అన్నారు. ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ సదస్సులో ఆయన ప్రసంగించారు. “నగరం అంటే కేవలం నివాసం.. పని చేసే ప్రాంతం మాత్రమే కాదు.. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రం. రాష్ట్ర జీడీపీలో కోర్ అర్బన్ రీజియన్ వాటా సుమారు 66 శాతం.. వాహనాలను కదిలించడం కాదు.. ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడమే మన లక్ష్యం.. అదే ముఖ్యం.. రోడ్లపై స్థలం పరిమితంగా ఉంది.. ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ప్రోత్సహించాలి.. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రజలంతా సమిష్టిగా ముందుకు రావాలి.. నో సోలో.. సాథ్ చలో అనేది మన నినాదం.. ఒంటరిగా ప్రయాణించకుండా అందరం కలిసి ప్రయాణించాలి” అని వ్యాఖ్యానించారు.

