NTV Telugu Site icon

Maha Kumbh Mela 2025: మహాకుంభమేళా నేపథ్యంలో విమాన ఛార్జీల నియంత్రణపై డీజీసీఏ చర్యలు

Dcga Maha Kumbh Mela

Dcga Maha Kumbh Mela

Maha Kumbh Mela 2025: మహా కుంభం నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు విమాన ప్రయాణాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీనితో టిక్కెట్ ధరలు గణనీయంగా పెరగడంతో, విమానయాన సంస్థలకు విమాన ఛార్జీలను హేతుబద్ధం చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సూచించింది. ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)కు ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్పైస్‌జెట్ (Spicejet) వంటి విమానయాన సంస్థలు ప్రయాగ్‌రాజ్‌కు మరిన్ని విమానాలను నడుపుతున్నాయి. జనవరి నెలలో ప్రయాగ్‌రాజ్‌కి విమాన కనెక్టివిటీని మెరుగుపరచడానికి డీజీసీఏ 81 అదనపు విమానాలను ఆమోదించింది. దీంతో మొత్తం 132 విమానాలు దేశవ్యాప్తంగా ప్రయాగ్‌రాజ్‌ను కనెక్ట్ చేస్తున్నాయి.

Also Read: Google Doodle: గణతంత్ర దినోత్సవ సందర్బంగా ‘వైల్డ్‌లైఫ్ మీట్స్ కల్చర్’ డూడుల్‌తో అదరగొట్టిన గూగుల్

డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో టిక్కెట్ ధరలను (ticket prices) నియంత్రించేందుకు జనవరి 23న డీజీసీఏ అధికారులు విమానయాన సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రెగ్యులేటర్, సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా, మరిన్ని విమానాలను జోడించడం, టిక్కెట్ ధరలను తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. నివేదిక ప్రకారం, ఇటీవల ఢిల్లీ-ప్రయాగ్‌రాజ్ విమాన టిక్కెట్ ధరలు 21 శాతం వరకు పెరిగాయి. మహా కుంభం ప్రారంభమైన జనవరి 13నుంచి, ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ వేడుకలో భారీ సంఖ్యలో భక్తులు, పర్యాటకులు పాల్గొంటుండడంతో ప్రయాగ్‌రాజ్‌కు విమాన బుకింగ్స్ అనేక రెట్లు పెరిగాయి. ఈ చర్యల ద్వారా విమాన ప్రయాణ సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా, ప్రయాణికులపై పడే ఆర్థిక భారం తగ్గించడంలో సహాయపడాలని డీజీసీఏ ఆశిస్తోంది.

Also Read: Chennai Airport: బాంబు పేల్చేస్తామంటూ బెదిరింపులు.. చెన్నై ఎయిర్‌పోర్టులో హై టెన్షన్!

ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా పర్వం హిందువుల సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమంలో జరిగే ఈ ఘట్టానికి దేశంలో మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ వేడుక కోసం ప్రయాగ్‌రాజ్ నగరంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహా కుంభం దృష్ట్యా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు డీజీసీఏ తీసుకుంటున్న చర్యలు ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తాయని భావిస్తున్నారు.