Magha Purnima: మాఘపౌర్ణమి సందర్భంగా నదీసాగర సంగమ స్థానాలు, సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. ఆంధ్రాలోని కోస్తాతీరంలోని పలు ప్రాంతాలతోపాటు హంసల దీవి, భీమిలి బీచ్ వంటి నదీ సంగమ స్థానాలు భక్తజన సంద్రమయ్యాయి. మకర సంక్రమణం మొదలు కుంభ సంక్రమణం మధ్య కాలం మాఘమాసం. ఈ మాసంలో పుణ్యస్నానాలు ఫలప్రదమన్నది శాస్త్రవచనం. నెలంతా వీలుకాకుంటే కనీసం మాఘ పూర్ణిమ రోజైనా పవిత్ర నదులు, సముద్రంలో స్నానం ఆచరిస్తే నెలంతటి ఫలితం కలుగుతుందని ఓ నమ్మకం. ఈ కారణంగా ఈరోజు తెల్లవారు జాము నుంచి భక్తులు నదీసాగర సంగమ స్థలాలు, తీరప్రాంతాల్లో స్నానాలకు పోటెత్తారు. అనకాపల్లి జిల్లా రేవుపోలవరం సముద్ర తీరoలో భక్తులు పెద్దఎత్తున సముద్రస్నానాలు చేశారు. అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సముద్ర స్నానాలు చేసి తీరంలో కొండపై ఉన్న శ్రీ మాధవస్వామిని భక్తులు దర్శించుకుoటున్నారు. సముద్ర స్నానాల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
Read Also: Chandrababu: టీడీపీ-జనసేన తొలి జాబితాపై సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ.. సర్వత్రా ఉత్కంఠ
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని సముద్ర తీరాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పూడిమడక, రాంబిల్లి రేవులకు భక్తులు భారీగా తరలివచ్చారు. అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా గజఈతగాళ్లను పోలీసులు సిద్ధం చేశారు. సముద్ర తీరం వద్ద మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గ్రామస్థులు,పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల నగదు, విలువైన వస్తువులూ చోరీలకు గురికాకుండా మైక్‌లతో పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర స్నానాలకు వచ్చిన భక్తులకు పలు స్వచ్చంద సంస్థలు మజ్జిగ, మంచినీళ్లూ ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి సమీపంలోను, విశాఖ జిల్లా భీమిలిలోని నదీ సాగర సంగమ స్థానాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. కోస్తా తీరం అంతటా భక్తుల రద్దీ కనిపించింది. సముద్ర స్నానాలు ఆచరించిన అనంతరం సమీపంలోని దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.