కేశినేని నాని వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. అనంతరం.. విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. తన రాజీనామాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన కేశినేని నాని.. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. కాగా.. కేశినేని రాజీనామా అంశంపై మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. కేవలం ఎంపీ పదవి కోసం ఇంత దిగజారి మాట్లాడాలా నాని? అని ప్రశ్నించారు. నిన్నటి వరకు దుర్మార్గుడిలా కనిపించిన జగన్ రెడ్డి.. ఇప్పుడు నానికి సన్మార్గుడు ఎలా అయ్యాడన్నారు. దుర్మార్గుడితో ఉండాలనుకుంటే అది నాని ఇష్టం.. కానీ అమరావతి రైతుల్ని కించపరచడం ఏమిటి అని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి కళ్లల్లో ఆనందం కోసం చంద్రబాబుని, లోకేషుని దుర్భాషలాడటం ఏమిటి అని ఉమ మండిపడ్డారు.
విజయవాడ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల నాయకులు నానికి దూరంగా ఉంది ఆయన నోటి దురుసుతనం వల్లేనని దేవినేని ఉమ ఆరోపించారు. నాని ఏకపక్షంగా తన కుమార్తెను విజయవాడ మేయర్ అభ్యర్థిగా ప్రకటించుకున్నా, ఆయనకు రెండుసార్లు ఎంపీ టికెట్ ఇచ్చిన టీడీపీ ఏమీ అనలేదని తెలిపారు. 2019 ఎన్నికల్లో నాని గెలుపు కోసం విజయవాడ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ అభ్యర్థులు, పార్టీ డబ్బు ఖర్చుపెట్టింది తప్ప, నాని రూపాయి పెట్టలేదని అన్నారు. ఎన్నికల్లో నాని చేసిన ఘనకార్యం ఏమిటంటే.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కుమ్మక్కై ఒక్క ఓటు తనకు వేయండి అని ప్రజల్ని అడుక్కున్నాడని విమర్శించారు. నాని 2 సార్లు ఎంపీగా గెలిచినా, తాను 5 సార్లు పోటీచేసినా కారణం టీడీపీనేనని తెలిపారు.
Ambati Rayudu: అందుకే వైసీపీని వీడుతున్నా.. అంబటి రాయుడు ట్వీట్
టీడీపీ కార్యకర్తల స్వేదం, రెక్కల కష్టం వల్లే తనకైనా.. నానికైనా పదవులు దక్కాయని దేవినేని ఉమ అన్నారు. నాని గానీ, తానుగానీ తమ చర్మం వలిచి చెప్పులు కుట్టించి టీడీపీకి ఇచ్చినా తమ రుణం తీరదన్నారు. నాని.. పదవిలో ఉన్నానని ఎంత అహంకారంతో మాట్లాడినా, చంద్రబాబుపై గౌరవంతో సర్దుకుపోయామని పేర్కొన్నారు. దుర్గమ్మ సన్నిధిలో నాని చేసిన వ్యాఖ్యలు ఆయనకే శాపంగా మారాయని ఆరోపించారు. విజయవాడ నగరాభివృద్ధి, ఉమ్మడి కృష్ణా జిల్లా అభివృద్ధికి టీడీపీ హయాంలో చంద్రబాబు వందలకోట్లు కేటాయించారని తెలిపారు. 2019 నుంచి ఇప్పటివరకు నాని.. విజయవాడ అభివృద్ధి కోసం జగన్ రెడ్డితో మాట్లాడి ఒక్కరూపాయి కూడా ఎందుకు తీసుకురాలేదు? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనుల్ని ఎందుకు పూర్తి చేయించలేకపోయాడని? దుయ్యబట్టారు.
తన ట్రావెల్స్ వ్యాపారం నాని వదులుకోవడానికి కారణం నష్టాలు రావడం వల్లేనని దేవినేని ఉమ ఆరోపించారు. కేశినేని ఆస్తులు అమ్ముకుంది.. ఆ నష్టాల నుంచి బయటపడటానికేనని తెలిపారు. ఆ నష్టాలను చంద్రబాబుకి ఆపాదించడం నాని దిగజారుడుతనమే అని విమర్శించారు. చంద్రబాబు పడుతున్న కష్టం చూసి తామంతా పార్టీ కోసం మౌనంగా అవమానాలు భరిస్తే, నాని మాత్రం ప్రోటోకాల్ పిచ్చితో ఇష్టానుసారం ప్రవర్తించాడని మండిపడ్డారు. లోకేశ్ పాదయాత్రలో యువతలో చైతన్యం వచ్చి, నేడు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సభలకు యువత కదిలి వస్తుంటే నానికి కనిపించడం లేదా? ప్రశ్నించారు. ఓడిపోయినా దెబ్బతిన్న బెబ్బులిలా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలోనే తిరిగి, చివరకు కరకట్ట కమల్ హాసన్ ఓటమిభయంతో రాజీనామా చేసేలా చేశాడని ఉమ పేర్కొన్నారు.
