NTV Telugu Site icon

Pawan Kalyan: గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పర్యటన

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పర్యటించారు. ఏలేరు వరద ముంపు కారణంగా గొల్లప్రోలులో నీట మునిగిన జగనన్న కాలనీ , పంట పొలాలను ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ పరిశీలించారు. పడవలో వెళ్లి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఏలేరు కాలువకు భారీ గండి పడి స్థానికులు వారం రోజులుగా వరద నీటిలోనే ఉంటున్నారన్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన గొల్లప్రోలులోని జగనన్న కాలనీకి చేరుకుని.. పడవలో ప్రయాణించి బాధితులతో మాట్లాడారు. వరద ప్రవాహం తగ్గే వరకు తాను జిల్లాలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తానని, వరద బాధితులకు అవసరమయిన సహాయాన్ని అందిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఏలేరుకు దిగువన గల సుద్దగడ్డవాగుకు వరద పోటెత్తడంతో స్థానిక కాలనీలన్నీ నీటిలో మునిగిపోయాయి. అలాగే ఏలేరు ప్రాజెక్టుకు ఎగువ నుండి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో కిర్లంపూడి, పిఠాపురం, జగ్గంపేట ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Read Also: Vijayawada: వరద బాధితుడిని చెంపదెబ్బ కొట్టిన వీఆర్వో..

అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఐదేళ్లలో కాలువలలో పూడికలు తీయలేదని వ్యాఖ్యానించారు. ఎవరు చేశారు, ఏం చేశారు అనేది మాట్లాడితే పొలిటికల్‌గా ఉంటుందని.. ఏపీలో గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయని పవన్‌ తెలిపారు. 20 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా రిజర్వాయర్లు అన్ని నిండాయని వెల్లడించారు. గత ప్రభుత్వం ముంపు ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చిందన్నారు. బ్రిడ్జ్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. వరదపోయిన తర్వాత అన్ని విషయాలపై చర్చిస్తామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.

 

Show comments