NTV Telugu Site icon

Pawan Kalyan: గ్రామాల్లో అభివృద్ధి పనులు పండుగలా మొదలుపెట్టాలి

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని, కూటమి పాలన మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పాలన మొదలైన తొలి వంద రోజుల్లోనే 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.1987 కోట్లు, ఎన్‌ఆర్ఈజీఎస్. ద్వారా రూ.4500 కోట్లు నిధులు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించినందున నిధుల సమస్య ఉత్పన్నం కాదన్నారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రతి పంచాయతీలో అభివృద్ధి పనులను మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ సభలలో ఆమోదించిన పనులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనుల ప్రారంభం గురించి ఈ సమావేశంలో చర్చించారు. 13,326 పంచాయతీల్లోనూ ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారని, ఆ మేరకు చేపట్టే పనులు, పని దినాల వివరాలను అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వెబ్ సైట్, డ్యాష్ బోర్డ్ ను ప్రారంభించారు.

Read Also: CM Chandrababu Naidu: తిరుమల లడ్డూ వివాదంపై మరోసారి చంద్రబాబు ఫైర్

మొదలుపెట్టిన పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.. 
అక్టోబర్ 14వ తేదీ నుంచి వారం రోజులపాటు పనుల ప్రారంభాన్ని ఒక పండగలా చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. 20వ తేదీ వరకూ పంచాయతీల్లో పనుల ప్రారంభానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్థానిక శాసన సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఇందులో భాగస్వాములను చేయాలని స్పష్టం చేశారు. ఒక వేడుకలా చేయడం ద్వారా గ్రామాల్లో తమకు వచ్చిన నిధులు, వాటితో చేసే పనులపై ప్రజలకు సమాచారం ఉంటుందని వివరించారు. మొదలైన పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, తనిఖీలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.