NTV Telugu Site icon

Pawan Kalyan: రాజకీయ ఒత్తిళ్లు ఉండొచ్చు కానీ.. పరిపాలన గాడి తప్పకూడదు: డిప్యూటీ సీఎం పవన్‌

Pawan Kalyan

Pawan Kalyan

రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కానీ.. పరిపాలన గాడి తప్పకూడదని కలెక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ సూచించారు. ప్రజలు తమని విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారని, వారు తమ ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారన్నారని అధికారులకు చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలను తాము చేయగలమని, వాటిని ప్రజలకు తీసుకెళ్లేది ఐఏఎస్, ఐపీఎస్‌లే పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులతో మిగిలింది పది లక్షల కోట్ల అప్పు అని డిప్యూటీ సీఎం విమర్శించారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ సహా మంత్రులు, 40 శాఖల అధిపతులు, 26 జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకూ సమావేశం కొనసాగనుంది.

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘గత ప్రభుత్వం చేసిన పనులు మూలాలు కదిలించేశాయి. ప్రజలు మమ్మల్ని విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారు. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలు మేం చేయగలం కానీ.. వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లేది ఐఏఎస్, ఐపీఎస్‌లే. గత ప్రభుత్వంలో జరిగిన వాటికి ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎందుకు మాట్లాడరు అనిపించేది. ఒక్కోసారి శ్రీలంకలా మారిపోతుందేమో అనిపించింది. గత ప్రభుత్వం చేసిన పనులతో మిగిలింది పది లక్షల కోట్ల అప్పు. రాళ్లు, రప్పల మధ్య హైదరాబాదు లాంటి నగరం సీఎం చంద్రబాబుకు కనిపించింది. వారసత్వంగా అప్పులతో వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే.. అందరూ కలిసి పని చేయాలి’ అని అన్నారు.

‘మంత్రి నాదెండ్ల మూడు చెక్ పోస్టులు పెట్టినా.. ఎలా పీడీఎస్ రైస్ రవాణా జరిగింది. ఇసుక విషయంలో ఎవరైనా చెయ్యి పెడితే కఠిన చర్యలుంటాయని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏదోటి చేయగలరని నేను బయటి వ్యక్తిగా ఉన్నపుడు అనుకునేవాడిని. అధికారులు ఎలా ఉండకూడదో గత ప్రభుత్వం చూపించింది. అధికారులు ఎలా ఉండాలంటే.. ఏపీలా ఉండాలనేలా ఇప్పుడు చేయాలి. రాజకీయ ఒత్తిళ్లు ఉండొచ్చు కానీ.. పరిపాలన గాడి తప్పకూడదు. గత ప్రభుత్వం రెవెన్యూ అధికారులతో సినిమా టిక్కెట్లు అమ్మించినా, ఇసుక దోపిడీ చేయించినా ఒక్క అధికారి ఎందుకు మాట్లాడలేదు?.. అంత నిస్సహాయత ఎందుకు?’ అని అధికారులను డిప్యూటీ సీఎం పవన్‌ ప్రశ్నించారు.

Show comments