Site icon NTV Telugu

Bhatti Vikramarka: ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం.. బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం సమాధానం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. బడ్జెట్‌లో కేటాయించిన ప్రతి రూపాయిని అన్ని వర్గాలకు చేరాలన్నదే మా ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్‌ స్ఫూర్తిగా రాజ్యాంగ పీఠికను గుర్తు చేశామన్నారు. ఇచ్చిన హామీలు, అమలు, బడ్జెట్ ఉందా లేదా అనేది అంచనా లేకపోవడంతో పదేళ్లు ఇబ్బంది జరిగిందన్నారు. బడ్జెట్‌ను సహేతుకంగా రూపొందించామని.. గత పదేళ్ళలో ఆదాయం ఉన్నా లేకున్నా, ప్రతి ఏడాది 20 శాతం బడ్జెట్ పెంచుతూ వచ్చారన్నారు. ఈ సారి అలా చేయదలుచుకోలేదని.. 5 నుంచి 6 శాతం తేడా కంటే ఎక్కువ ఉండొద్దని మా ఆలోచన పేర్కొన్నారు.

Read Also: Rajyasabha Elections: ముగిసిన రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు

బడ్జెట్ తగ్గించడంపై ఎవరు ఏమనుకున్నా.. వాస్తవ బడ్జెట్ ఉండాలి అనేది మా విధానమన్నారు. 2. 75 లక్షల కోట్ల బడ్జెట్‌లో.. గతంలో మాదిరిగా గ్యాప్స్ ఉండవన్నారు. మేము ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు బడ్జెట్ ఉండాలనేది మా విధానమన్నారు. మీరు డబ్బులు లేకున్నా బడ్జెట్ పెంచి బీసీలకు రుణాలు ఇవ్వలేకపోయారని.. దళితబంధు ఇవ్వలేక పోయారని ఆయన విమర్శించారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడం తప్పని సరి అని.. మీరు చేసిన ఇబ్బందులు అధిగమించే ప్లాన్ చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి రూ.7 లక్ష ల 11 వేల కోట్ల అప్పు ఉందని వెల్లడించారు. మేము అప్పు చేయకపోతే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తెచ్చారన్నారు. ఉద్యోగాల కోసం పదేళ్లు యువత గడ్డాలు పెంచుకుని తిరిగారని.. ఒక్క గ్రూప్-1 ఉద్యోగం అయినా మీరు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీకి అదనంగా సిబ్బందిని, 40 కోట్లు వెంటనే విడుదల చేశామన్నారు. ఒకే రోజు 6,900 నర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. సింగరేణిలో 412 మందికి ఉద్యోగ పత్రాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల జాతర పెట్టామన్నారు. జాతర కొనసాగుతుందన్నారు.

ఇంకో 2 వేల మందికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఉన్న దాంట్లోనే కొద్దీ కొద్దిగా అన్నిటినీ అమలు చేస్తామన్నారు. 3500 ఇందిరమ్మ ఇండ్లు ప్రతీ నియోజకవర్గంలో ఇస్తామని డిప్యూటీ సీఎం అసెంబ్లీలో తెలిపారు. నెలకు 300 కోట్లు అదనంగా ఆర్టీసీకి ఇస్తున్నామన్నారు. రూ.500కే సిలిండర్‌, మహాలక్ష్మి పథకం అమలుకు అంచనాలు వేస్తున్నామన్నారు. ఫైనల్ బడ్జెట్‌లో అన్నింటికీ మార్పులు చేర్పులు ఉంటాయన్నారు.

Exit mobile version