Delhi Car Horror: ఢిల్లీలో స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. అంజలి పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. కారు చక్రంలో కాలు చిక్కుకుని కిలోమీటర్ల మేర లాక్కెళ్లటం వల్ల తల పగిలిందని తెలిసింది. 20 ఏళ్ల మహిళ దేహంపై కనీసం 40 బాహ్య గాయాలు ఉన్నాయని, చర్మం ఒలిచినందున ఆమె పక్కటెముకలు ఆమె వెనుక నుంచి బయటపడ్డాయని ఆమె శవపరీక్షలో వెల్లడైంది.
ఆమె పుర్రె పగిలి మెదడులోని కొంచెం భాగం మిస్సయ్యిందని.. విపరీతంగా రక్తస్రావం జరిగిందని తెలిసింది. ఊపిరితిత్తులు వెనుక వైపు నుంచి బయటకు కనిపిస్తున్నాయని.. రోడ్డుపై ఈడ్చుకుపోవటం వల్ల హీట్‌కు శరీరం కమిలిపోయిందని శవపరీక్ష నిర్వహించిన వైద్యులు వెల్లడించారు. ఆ సమయంలో అంజలి ఆల్కహాల్ సేవించలేదని తేలింది. ఆ యువతి ప్రైవేట్ భాగాల్లో ఎటువంటి గాయాలు లేవని పోస్టుమార్టంలో తెలిసింది. ఆమెపై లైంగిక వేధింపులు జరగలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితురాలు అంజలి సింగ్ కుటుంబం, ఇతరులు ఆమెకు న్యాయం చేయాలంటూ ఆమె దహన సంస్కారాల వద్ద నిరసన తెలిపారు. మంగళవారం దహనం చేసిన ఆమె మృతదేహం రోడ్డు పక్కన కనిపించినప్పుడు బట్టలు విప్పి ఉండటంతో ఆమె అత్యాచారానికి గురైందని ఆమె తల్లి భయపడింది.
Love Marriage Tragedy: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ రెండు రోజులకే..
మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలోని వైద్యులు ఈ శవపరీక్ష నిర్వహించారు. పోలీసులకు శవపరీక్ష రిపోర్టును అందజేశామని వెల్లడించారు. తదుపరి పరీక్షల కోసం, నమూనాలు, ఆమె జీన్స్ ప్యాంట్ ముక్కలు భద్రపరచబడ్డాయి. పోలీసులు కారులోని ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంతో మరణానికి కారణమైన అభియోగాల ప్రకారం కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు ఇప్పటికే చెప్పారు. ఏది ఏమైనప్పటికీ పోలీసులకు ఒక కీలక సాక్షి దొరికారు. కారు బాధితురాలి స్కూటర్‌ను ఢీకొట్టినప్పుడు అంజలి స్నేహితురాలు నిధితో ఉన్నారు. ఆ స్నేహితురాలు ఈ ఘటన జరగగానే అక్కడి నుంచి పారిపోయారు. అయితే అంజలి కాలు కారు యాక్సిల్‌లో ఇరుక్కుపోయిందని పలువురు వెల్లడించారు. నిధి ఇప్పుడు కీలక ప్రత్యక్ష సాక్షి అని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు సోమవారం సుల్తాన్‌పురి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
నూతన సంవత్సరం వేళ ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో ఆదివారం తెల్లవారుజామున 20 ఏళ్ల యువతిని కారు ఢీకొట్టి ఆమెను 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. కిలోమీటర్ల మేర యువతిని కారు ఈడ్చుకెళ్లడం వల్ల ఆమె శరీరం ఛిద్రమెంది. యువతిని కారు ఈడ్చుకెళ్లడాన్ని చూసిన స్థానికుడు పోలీసులకు సమాచారం అందించగా.. అన్ని చెక్‌పోస్ట్‌లను అలర్ట్ చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈలోగా రోడ్డుపై నగ్నంగా యువతి మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాల ఆధారం కారును గుర్తించిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ సీఎం
అంజలి సింగ్ కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం పరామర్శించారు. ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇది భయంకరమైన క్రూరత్వానికి సంబంధించిన ఘటన అని ఆయన అన్నారు. ఘటన జరిగినప్పుడు కారులో ఉన్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అంజలి సింగ్ అంత్యక్రియలను మంగళవారం నిర్వహించారు.