ఢిల్లీలోని తిమార్‌పూర్ ప్రాంతంలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. టెంపో ముందు సీట్లో కూర్చోనివ్వకపోవడంతో ఓ యువకుడు తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపాడు. సంఘటనా స్థలంలోని స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుంచి తుపాకీ, 12 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Thomson Smart TV: థామ్సన్ 43-అంగుళాల స్మార్ట్ టీవీ విడుదల.. ధర ఎంతంటే?
పోలీసుల కథనం ప్రకారం.. తిమార్‌పూర్ నివాసి సురేంద్ర సింగ్ (60) సీఐఎస్‌ఎఫ్ లో ఎస్‌ఐగా పని చేశారు. దాదాపు ఆరు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. ఇంత కాలం తిమార్‌పూర్‌లోని తన కుటుంబంతో కలిసి ఓ ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివసించారు. ఈ ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేసి తమ ప్రాంతమైన ఉత్తరాఖండ్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గురువారం సాయంత్రం వస్తువులను తీసుకెళ్లడానికి ఒక టెంపోను అద్దెకు తీసుకున్నారు. అందులో సామాన్లు లోడ్ చేశారు. అయితే.. టెంపో ముందు సీటులో కూర్చోవాలని సురేంద్ర సింగ్ కుమారుడు దీపక్ (26) పట్టుబట్టాడు. కానీ తండ్రి నిరాకరించారు.
కోపంతో దీపక్ లైసెన్స్‌డ్ గన్‌తో తండ్రిపై కాల్పులు జరిపాడు. రాత్రి 7.30 గంటలకు పెట్రోలింగ్ పోలీసులకు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో ఆయన ఎంఎస్ బ్లాక్ సమీపంలోకి చేరుకున్నారు. సురేంద్ర సింగ్ ఫుట్‌పాత్‌పై రక్తపు మరకలతో పడి ఉండటం చూశారు. కొంతమంది అతడి కుమారుడు దీపక్ నుంచి తుపాకీని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. పెట్రోలింగ్ కానిస్టేబుల్స్ ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వృద్ధుడిని హిందూ రావు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపి కేసు దర్యాప్తు ప్రారంభించారు.