NTV Telugu Site icon

Delhi: ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు.. ఆలస్యంగా నడిచిన విమానాలు, రైళ్లు..

Delhi Flights

Delhi Flights

దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచు కురిసింది. దీంతో.. 194 విమానాలు, 22 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 3.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇది ఈ సీజన్ లో కనిష్ట ఉష్ణోగ్రత. ఈ ఉదయం ఢిల్లీ విమానాశ్రయం ప్రాంతంలో విజిబిలిటీ జీరో మీటర్లుగా ఉంది. కాగా.. ఢిల్లీ విమానాశ్రయం గత రాత్రి పొగమంచు హెచ్చరికను జారీ చేసింది. ప్రయాణీకులు విమానాల గురించి తాజా సమాచారం కోసం విమానయాన సంస్థలను సంప్రదించాలని కోరారు. ఈ రోజు కనీసం 25 విమానాలను రద్దు చేసినట్లు సైట్ వెల్లడించింది. రేపు కూడా మరో ఏడు విమానాలు రద్దు చేయబడ్డాయి.

విమానయాన సంస్థలు ఉత్తర భారతదేశంలోని “వాతావరణ సవాళ్ల”పై కూడా దృష్టిని ఆకర్షించాయి. ప్రతికూల వాతావరణం కారణంగా తమ విమానాల షెడ్యూల్‌కు అంతరాయం కలగవచ్చని ఇండిగో తెలిపింది. ఢిల్లీ, అమృత్‌సర్, జమ్మూ, వారణాసి, గోరఖ్‌పూర్, గౌహతి, పాట్నా, బాగ్‌డోగ్రా, దర్భంగాలలో దృశ్యమానత సరిగా లేనందున బయలుదేరే, రాక విమానాలు ప్రభావితం కావచ్చని స్పైస్‌జెట్ హెచ్చరించింది. మరోవైపు.. చెన్నైలో పొంగల్ నాడు భోగి మంటలు, ఆచారాల వల్ల పొగలు రావడంతో దృశ్యమానత తగ్గిపోయింది. చెన్నైకి వచ్చే ఐదు అంతర్జాతీయ విమానాలను హైదరాబాద్ వైపు మళ్లించగా, 18 విమానాలు ఆలస్యమయ్యాయి. ఈ ఉదయం చెన్నై విమానాశ్రయం ల్యాండింగ్‌ను గంటపాటు నిలిపివేసింది.

Yuvraj Singh: టీమిండియాకు హార్దిక్ పాండ్యా అవసరం.. జట్టులో ముఖ్యమైన ఆటగాడు..

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురిసింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. ఆదివారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత సీజన్ సగటు కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదైంది. రాబోయే రెండు రోజుల పాటు దేశ రాజధానిలో చాలా దట్టమైన పొగమంచు, చలిగాలుల పరిస్థితులను IMD అంచనా వేసింది. జనవరి 20 వరకు దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు కురుస్తుందని IMD తెలిపింది. దేశ రాజధాని, అనేక ఇతర రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీకి వెళ్లే 22 రైళ్లు.. ఒకటి నుండి ఆరు గంటలు ఆలస్యంగా ఉన్నాయని భారతీయ రైల్వే ఆదివారం తెలిపింది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం, ఢిల్లీ మొత్తం గాలి నాణ్యత సూచిక (AQI) ఉదయం 9 గంటలకు 458 గా ఉంది.

ఇదిలా ఉంటే.. గంగానగర్, పాటియాలా, అంబాలా, చండీగఢ్, పాలం, సఫ్దర్‌జంగ్, బరేలీ, లక్నో, బహ్రైచ్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, తేజ్‌పూర్‌లలో మొదటిసారిగా జీరో విజిబిలిటీ నమోదైంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్, జమ్మూ డివిజన్, చండీగఢ్, అస్సాం, దక్షిణ అంతర్గత కర్ణాటకలో చాలా దట్టమైన పొగమంచు కురిసింది. త్రిపుర, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు పొగమంచు కురిసింది.

మరోవైపు.. ఢిల్లీలోని పాఠశాలలు రేపటి నుండి (సోమవారం) పునఃప్రారంభం కానున్నాయి. అయితే చలి తీవ్రత దృష్ట్యా పాఠశాలల వేళలను మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 9:00 గంటలలోపు ఏ పాఠశాల కార్యకలాపాలు ప్రారంభించకూడదని అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో.. ఈ మార్పుతో విద్యార్థులకు ఉదయం చలి నుంచి ఉపశమనం లభించనుంది. అంతేకాకుండా.. సాయంత్రం 5:00 గంటల తర్వాత ఏ పాఠశాలను నడపరాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

Keerthy Suresh: పవన్ సినిమా ఇక్కడ ఆగింది.. అక్కడ మొదలైంది

Show comments