NTV Telugu Site icon

Delhi: ఆప్-బీజేపీ పోరు.. మరోసారి నిలిచిపోయిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక

Delhi Mayor Polls

Delhi Mayor Polls

Delhi Mayor Polls: ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో సందిగ్ధత నెలకొంది. మున్సిపల్ సమావేశంలో ఎన్నిక సందర్భంగా ఆప్, బీజేపీ కార్పిరేటర్ల ఆందోళనల మధ్య మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక మరోసారి నిలిచిపోయింది. మున్సిపల్ ఎన్నికల తర్వాత సమావేశమయ్యే మొదటి సభలోనే మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోవలసి ఉన్న సభలో గందరగోళంతో గతంలో ఎన్నిక ప్రక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సమావేశాల్లో ఆందోళన నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో 134 వార్డుల్లో ఆప్ గెలవగా.. 104 వార్డులకు బీజేపీ పరిమితం అయింది. కాంగ్రెస్ 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. డిసెంబరు 4న పౌర ఎన్నికలు నిర్వహించగా, డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరిగింది.

తొలి సమావేశం జనవరి 6న జరగగా.. మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోకుండానే వాయిదా పడింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన తాత్కాలిక స్పీకర్ సత్య శర్మ, నామినేటెడ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించే సమయంలో గొడవ చెలరేగింది. ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు నినాదాలు చేస్తూ.. నామినేటెడ్ సభ్యుల కన్నా ముందుగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ 10 మంది నామినేటెడ్ సభ్యులను నియమించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యంతరం తెలిపింది.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న అందాల నటి ఊర్మిళ మటోండ్కర్

మేయర్ పదవికి ఆప్ తరపున షెల్లీ ఒబెరాయ్, అషు ఠాకూర్ పోటీ పడుతున్నారు. బీజేపీ రేఖ గుప్తా పేరును ప్రతిపాదించింది. డిప్యూటీ మేయర్ పదవికి నామినీలు ఆలే మొహమ్మద్ ఇక్బాల్, జలజ్ కుమార్ (ఆప్), కమల్ బాగ్రీ (బీజేపీ)లను ఇరు పార్టీలు ప్రతిపాదించాయి. మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు మున్సిపల్ స్టాండింగ్ కమిటీలోని ఆరుగురు సభ్యులు కూడా మున్సిపల్ సమావేశంలో ఎన్నుకోబడతారు. జాతీయ రాజధానిలో మేయర్ పదవికి రొటేషన్ ప్రాతిపదికన ఐదు ఒకే-సంవత్సరాల పదవీకాలం ఉంటుంది. మొదటి సంవత్సరం మహిళలకు, రెండో సంవత్సరం ఓపెన్ కేటగిరీకి, మూడోది రిజర్వ్‌డ్ కేటగిరీకి, మిగిలిన రెండు మళ్లీ ఓపెన్ కేటగిరీకి రిజర్వ్ చేయబడింది. దీంతో ఢిల్లీకి ఈ ఏడాది మహిళా మేయర్‌ రానున్నారు.