BJP: ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం (నవంబర్ 1) ఇండియా కూటమి నిర్వహించిన భారీ ర్యాలీ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు పదునెక్కాయి. సభకు 10 లక్షల మంది హాజరవుతారని రాహుల్ గాంధీ చెబుతుంటే, పోలీసులు మాత్రం 50,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీని మళ్లీ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ ర్యాలీ జరుగుతోందని బీజేపీ ఎద్దేవా చేసింది. ఢిల్లీ బీజేపీ ఈ ర్యాలీని ‘గుండాల జాతర’గా అభివర్ణిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేసింది.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఓట్ల చోరీ ఆరోపణలకు వ్యతిరేకంగా ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీని ఆదివారం కూడా ఖాళీగా ఉండకుండా చూసేందుకు మరో ఖరీదైన ప్రచార కార్యక్రమమని బీజేపీ విమర్శిస్తోంది.
పంజాబ్ బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షేర్గిల్ ఇండియా కూటమి ర్యాలీపై మాట్లాడుతూ.. ఓట్ల చోరీ జరిగితే రాహుల్ గాంధీ రెండు చోట్ల ఎలా గెలిచారు? అని ప్రశ్నించారు. ఆయన రాజీనామా చేసిన వయనాడ్‌లో ఆయన సోదరి ప్రియాంకా గాంధీ ఎలా గెలిచారని అడిగారు. కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో అధికారానికి దూరంగా ఉండటాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తమిళనాడులో 59 ఏళ్లు, పశ్చిమ బెంగాల్లో 49 ఏళ్లుగా, సిక్కింలో 42 ఏళ్లుగా, ఉత్తరప్రదేశ్‌లో 37 ఏళ్లుగా, బీహార్‌లో 36 ఏళ్లుగా, గుజరాత్లో 30 ఏళ్లుగా, ఒడిశాలో 26 ఏళ్లుగా, నాగాలాండ్‌లో 23 ఏళ్లుగా, మహారాష్ట్రలో 12 ఏళ్లుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎందుకు లేరని ఆయన ప్రశ్నించారు.

