రైతులు చేపట్టిన చలో ఢిల్లీ (Farmers protest) కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 24 ఏళ్ల యువరైతు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో రెండ్రోజుల పాటు నిరసనలకు బ్రేక్ ఇవ్వాలని రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
హర్యానాలోని ఖనౌరి సరిహద్దులో నిరసన తెలుపుతున్న ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకోగా ఓ అన్నదాత ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో రెండ్రోజుల పాటు ఢిల్లీ మార్చ్‌ను రద్దు చేస్తున్నట్టు ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రకటించింది. పోలీసుల చర్యల వల్లే రైతు మృతి చెందినట్టు రైతు సంఘం ఆల్ ఇండియా కిసాన్ సభ (AIKS) ఆరోపించింది. అయితే బైఠాయింపు నిరసన ప్రదర్శన మాత్రం కొనసాగుతుందని తెలిపింది.
హర్యానా (Haryana)లోని ఖనౌరి సరిహద్దులో రైతులు, పోలీసుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో మృతి చెందిన రైతు ఒంటిపై బుల్లెట్ గాయాలున్నట్టు పాటియాలా ఆస్పత్రి వైద్యుడు ఒకరు తెలిపారు. పోస్ట్ మార్టం నివేదక కోసం ఎదురుచూస్తు్న్నామన్నారు.
ఖనౌరి నుంచి ముగ్గురు క్షతగాత్రులు తమ దగ్గరకు వచ్చారని.. వారిలో ఒకరు ఆస్పత్రికి తీసుకువస్తుండగానే కన్నుమూశారని, తక్కిన ఇద్దరికి తలపై, తొడపై బుల్లెట్ గాయాలున్నాయని పాటియాలా రాజేంద్ర ఆస్పత్రి సీనియర్ మెడికల్ అధికారి డాక్టర్ రేఖి తెలిపారు. ఆస్పత్రికి తీసుకువస్తుండగా మరణించిన వ్యక్తి తలకు బుల్లెట్ గాయమైందని, బుల్లెట్ సైజు ఎంత అనేది పోస్ట్‌మార్టంలో తేలుతుందన్నారు.
24 ఏళ్ల సుభ్ కరణ్ సింగ్ బటిండా నివాసి అని, అతను బటిండా జిల్లా వలో గ్రామానికి చెందిన చరణ్ జిత్ సింగ్ కుమారుడని రైతు నేత కాకా సింగ్ కోట్రా తెలిపారు. కరణ్ సింగ్ మృతదేహాన్ని పాటియాలా రాజేంద్ర ఆస్పత్రిలో భద్రపరిచినట్టు చెప్పారు.