Tufail Ahmad Arrest: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA), స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) శనివారం ఢిల్లీ కారు పేలుడు కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు. పుల్వామా నివాసి అయిన తుఫైల్ అహ్మద్‌ను దర్యాప్తు బృందాలు అరెస్టు చేశాయి. తుఫైల్ అక్కడి ఒక పారిశ్రామిక ఎస్టేట్‌లో పనిచేసే ఎలక్ట్రీషియన్. ఇప్పటికే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ టెర్రర్ మాడ్యూల్‌లో తుఫైల్ పాత్ర గతంలో నమ్మిన దానికంటే చాలా విస్తృతమైనదని సూచించే ఆధారాలు లభించాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. తుఫైల్ ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడు, ఆయన కార్యకలాపాలు, ఢిల్లీ కారు బాంబు దాడిలో పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలపై ఏజెన్సీలు నిశితంగా దర్యాప్తు చేస్తున్నాయి.
READ ALSO: Maoists: మావోయిస్టుల మృతదేహాలకు ముగిసిన పోస్టుమార్టం..
దర్యాప్తులో ఏం తేలిందంటే..
జైష్-ఎ-మొహమ్మద్‌తో ముడిపడి ఉన్న ఈ అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌ను ఇప్పటికే SIA, SOG బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. తుఫైల్ అరెస్టు అనేది ఈ ఆపరేషన్‌లో భాగంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఈ నెట్‌వర్క్‌ను అర్థం చేసుకోవడానికి, కుట్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ గుర్తించడానికి పని చేస్తున్నట్లు దర్యాప్తు బృందాలు తెలిపాయి. ఇప్పుడు పోలీసులు, దర్యాప్తు సంస్థలు తుఫైల్‌కు వ్యతిరేకంగా అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. ఢిల్లీ పేలుళ్ల కుట్రలో పాల్గొన్న అందరిని బయటికి తీసుకురావడమే లక్ష్యం పని చేస్తున్నట్లు తెలిపారు.
దాడి ఎప్పుడు జరిగిందంటే..
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నవంబర్ 10న ఒక శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఇందులో ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో సహా కనీసం 14 మంది మరణించారు. ఆత్మాహుతి బాంబర్ నడుపుతున్న తెల్లటి హ్యుందాయ్ i20 కారులో ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ ఆత్మాహుతి బాంబర్‌కు ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంతో సంబంధం ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ పేలుడు బహుళ ప్రదేశాలపై దాడి చేయడానికి జరిగిన పెద్ద కుట్రలో భాగమా అనే కొణంలో దర్యాప్తు సంస్థలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయి. ఈ మొత్తం పథకం కోసం నిందితులు స్వయంగా డబ్బును సేకరించారని సమాచారం.
READ ALSO: Adani Group: ఆరేళ్లలో ఆరు ప్రధాన కంపెనీలను కొన్న అదానీ.. అవి ఏంటో తెలుసా!