తల్లి అనే ఈ రెండు అక్షరాల్లోనే ప్రేమ ఉంటుంది. తల్లి ప్రేమను ఈ లోకంలో ఎవరు అందించలేరు. తల్లి బిడ్డల బాంధవ్యం విడదీయరానిది. కష్టమొచ్చినా.. దుఖమొచ్చినా.. ఏం సమస్య వచ్చినా ముందుగా చెప్పుకునేది తల్లితోనే. కుటుంబంలో తల్లితోనే ఎక్కువ అనురాగం ఉంటుంది. ఇది ఎవరు కాదన్నా.. అవునన్నా.. ఇది నిజం. పేగుతెంచుకుని పుట్టిన కన్నబిడ్డ తప్పిపోయి 22 ఏళ్లు గడిచిపోయింది. బిడ్డ రాక కోసం కళ్లుకాయలు కాసేలా ఆ మాతృమూర్తి ఎదురుచూసింది. ఆమె నిరీక్షణ 22 ఏళ్ల తర్వాత ఫలించింది. తన కడుపున పుట్టిన బిడ్డే కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. చెప్పలేనంత సంతోషం. కానీ అంతలోనే అది ఆవిరైపోయింది. తనయుడు ఇచ్చిన షాక్‌తో దుఖం కట్టలు తెంచుకొచ్చింది. ఈ హృదయ విదారకరమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) చోటుచేసుకుంది.
11 ఏళ్ల పింకు తన తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలో (Delhi) నివాసం ఉండేవాడు. తల్లిదండ్రులు ఏదో చిన్న మాట అన్నారని ఇంట్లో నుంచి పారిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. బిడ్డ రాక కోసం ఎదురుచూసి.. చూసి ఆశలు వదులుకున్నారు.
కానీ పింకు (Delhi boy) మాత్రం 22 ఏళ్ల తర్వాత తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ వారి స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జల్లా ఖరౌలి గ్రామానికి చేరుకున్నాడు. దీంతో గ్రామస్థులంతా షాక్ అయ్యారు. ఈ సమాచారాన్ని ఢిల్లీలో ఉంటున్న తల్లిదండ్రులకు చేరవేశారు. హుటాహుటినా కొడుకు దగ్గరకు చేరుకున్నారు. ఒంటిపై ఉన్న పుట్టిమచ్చలు చూసి.. వచ్చింది తమ బిడ్డేనని ఆ పేరెంట్స్ ఎంతగానో సంతోషించారు. కానీ తనయుడి యొక్క వస్త్రధారణ.. ఆహార్యాన్ని చూసి ఆ తల్లిదండ్రుల మనసు కృంగిపోయింది. కొడుకు జానపద కథలు చెబుతూ ఇంటింటికీ తిరుగుతూ భిక్షాటన చేస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో రాజులాగా బ్రతకాల్సిన కొడుకు ఇలా మారిపోయాడేంటి? అంటూ ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది.
ఓ వైపు బిడ్డ వచ్చాడన్న ఆనందం.. ఇంకోవైపు బిడ్డ యొక్క ధీనస్థితి.. ఇలా ఆ తల్లిదండ్రులు ఎంతగానో మానసిక సంఘర్షణకు గురయ్యారు. ఏదేమైతే మా బిడ్డ మాకు దక్కాడంటూ ఆ తల్లి మురిసిపోయింది. కానీ పింకూ మాత్రం కోలుకోలేని షాకిచ్చాడు. తాను తల్లిదండ్రులతో కలిసి ఉండలేనంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆ తల్లిదండ్రుల వేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. ఈ సంఘటనతో గ్రామస్థులు కూడా చలించిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకు రాకూడదంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.