Deaths Of Tigers increasing in Tamilnadu: పెద్దపులులకు అటవీ ప్రాంతాల్లోనే రక్షణ లేకుండా పోతోంది. దట్టమైన అడవుల్లో వేటగాళ్లు, ప్రమాదాల బారిన పడి అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. తమిళనాడులో అయితే ఈ మరణాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. పెద్దపులుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే కేవలం నెలరోజుల్లోనే తొమ్మిది పెద్ద పులులు ,ఐదు చిన్న పులి పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందాయి. ప్రస్తుతం ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీటి మరణానికి సంబంధించిన అసలు కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. తాజాగా నీలగిరి జిల్లా చీకూర్ అటవీ ప్రాంతంలో రెండు చిన్న పులులు అనుమానస్పద రీతిలో మరణించాయి. అయితే ఈ ఘటనలో ఒక పులిపిల్లను కాపాడిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
Also Read: Indian Railways: గుడ్ న్యూస్.. పరిహారాన్ని పది రెట్లు పెంచిన రైల్వే బోర్డు
చనిపోయిన పులిపిల్లకు పోస్టు మార్టం చేయించిన పోలీసులు అనంతరం వాటిని దహనం చేశారు. ఇలా వరుసగా పులుల చనిపోవడంతో ఆందోళన చెందుతున్న అధికారులు వీటి మరణాలపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక తమిళనాడులో తన ఆవును చంపాయన్న పగతో పెద్దపులలకు ఓ వ్యక్తి విషం పెట్టి చంపిన విషయం కూడా తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ రైతు ఆవు కళేబరానికి విషం రాసి పులులను చంపాడు. ఈ ఘటనలో రెండు చిన్న పులులు మరణించాయి. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ కూడా చేశారు. ప్రపంచంలో ఉన్న మొత్తం పెద్దపులుల్లో నాలుగింట మూడొంతులకుపైగా మనదేశంలోనే ఉన్నాయి. కొన్నేళ్లుగా వీటిసంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో వేటగాళ్ల బారిన పడి అవి చనిపోవడం.. తాజాగా తమిళనాడులో వరుస ఇలాంటి ఘటనలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక 2022లో దేశంలో ఏకంగా 117 పెద్దపులులు మరణించాయి. అంటే ప్రతినెలా వివిధ కారణాలతో దాదాపు 10 పులులు చనిపోయాయి. అసలకే ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో ఇలా వరుస మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటి కన్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.