ఆ ఇంట్లో పెళ్లి భాజాల చప్పుడు చెవిలో ఇంకా మారుమోగుతూనే ఉంది. ఇంతలో చావు డప్పు వినాల్సి వచ్చింది. ఇది అత్యంత బాధాకరం. నారాయణపేట జిల్లా కోటకొండకు చెందిన బసుదే రాహుల్ (25) అనే యువకుడు ఏప్రిల్ 21న వివాహం చేసుకున్నాడు. సరిగ్గా 50 రోజులు గడవకముందే ఈనెల 11వ తేదీన ప్రమాదానికి గురయ్యాడు. ఉద్యోగరీత్యా జడ్చర్ల దగ్గర్లోని ఓ ఫార్మా కంపెనీలో విధులు నిర్వహించేందుకు వెళుతుండగా కోటకొండ సమీపంలో అడవి పంది ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యలు యువకున్ని హుటాహుటిన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా.. బ్రేయిన్ డెడ్ కి గురయ్యాడు. దాదాపు వారం రోజులపాటు చావుతో పోరాడి చివరకు ఓడిపోయాడు. చివరకు ఈనెల 17న ప్రాణం ఊపిరి వదిలాడు.
READ MORE: White Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా.. మరి కేంద్రప్రభుత్వం అందించే ఈ పథకాలను అందుకుంటున్నారా..
దానాల్లోకెల్లా గొప్ప దానం అవయవదానం అని అంటుంటారు. ఎందుకంటే ఎవరైన చనిపోయాక వారి అవయవాలు దానం చేస్తే మరొకరి ప్రాణాలు కాపాడిన వాళ్లవుతారు. వాళ్లకి మళ్లీ పునర్జన్మను ఇచ్చిన వాళ్లవుతారు. అందుకోసమే కొంతమంది తాము చనిపోయిన అనంతరం తమ అవయవ దానం చేసేందుకు ముందుకు వస్తారు. ఇందుకు కోసం పలు ట్రస్టులతో ఒప్పందం కూడా చేసుకుంటారు. అలాగే మరికొందరు కూడా తమ కుటుంబీకుల్లో ఎవరైన మరణిస్తే అవయవ దానం చేస్తారు. ఇలాగే.. రాహుల్ కుటుంబీకులు ఏమీ ఆలోచించకుండా అతడి ఆర్గాన్స్ దానం చేసి గొప్ప మనుసు చాటుకున్నారు. బ్రేయిన్ డెడ్ అయి మరణించినా.. అవయవదానం చేసి పునర్జన్మ ఎత్తాడు రాహుల్. తమ కుమారుడు కన్నుమూశాడని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు.. మరే ఇంట ఈ విషాదం జరగకూడదనుకుని అతని అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. గుండె, కిడ్నీలు, కళ్లు, ఊపిరితిత్తులు, లివర్ దానం ఇచ్చారు. తాను చనిపోయి కూడా మరో అయిదుగురి ప్రాణాలు కాపాడాడు రాహుల్. ఆసుపత్రి సిబ్బంది తుది లాంఛనాలు పూర్తి చేసి యువకుని మృతదేహాన్ని వారికి అప్పగించారు. మంగళవారం స్వగ్రామమైన కోటకొండలో అంత్యక్రియలు జరిగాయి.