NTV Telugu Site icon

Third INDIA Meet: ‘ఇండియా’ కూటమి తదుపరి సమావేశానికి తేదీ ఫిక్స్.. ఆతిథ్యం ఇవ్వనున్న ఉద్ధవ్

India

India

Third INDIA Meet: ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ మూడో సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో ముంబైలో జరుగుతుందని కాంగ్రెస్, శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఈరోజు ప్రకటించాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎంపీ హోదాను పునరుద్ధరించడానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది. ఆ కారణంగా ఈ సమావేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని పార్టీ పేర్కొంది. 2019లో మోదీ ఇంటిపేరుతో చేసిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలడంతో సుప్రీం కోర్టు స్టే విధించిన తర్వాత, ఆయన ఎంపీ హోదాను పునరుద్ధరించడంతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడిందని మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే శనివారం తెలిపారు. ఆహ్వానాలు పంపే విధానం, ఇతర ఏర్పాట్లపై చర్చించినట్లు పటోలే తెలిపారు. సమావేశం నేపథ్యంలో ప్రోటోకాల్‌లను అమలు చేయాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ సమర్పించనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు తెలిపారు. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన ప్రతిపాదనలను పరిశీలిస్తామని కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్ నానా పటోలే తెలిపారు.

Also Read: Nuh Violence: నూహ్‌లో మూడో రోజు బుల్డోజర్ యాక్షన్.. మెడికల్ షాపులు, దుకాణాలు కూల్చివేత

ఇదిలా ఉండగా, ఐదుగురు ముఖ్యమంత్రులతో సహా విపక్ష నేతలకు ఉద్ధవ్ ఠాక్రే ఆగస్టు 31న విందుకు ఆతిథ్యం ఇస్తారని శివసేన (యూబీటి) నాయకుడు సంజయ్ రౌత్ తెలిపారు. గ్రాండ్ హయత్‌లో జరిగే రెండు రోజుల చర్చలు ఆగస్టు 31 సాయంత్రం, సెప్టెంబరు 1 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. సమావేశం తరువాత విలేకరుల సమావేశం ఉంటుందని నాయకులు తెలిపారు. విపక్ష కూటమి మొదటి సమావేశం జూన్ 23న పాట్నాలో జరిగింది, దీనిని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏర్పాటు చేశారు. రెండవ సమావేశం జూలై 18న బెంగళూరులో జరిగింది, దీనిలో 26 ప్రతిపక్ష పార్టీల కూటమికి I.N.D.I.A (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) అని పేరు పెట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌తో తలపడేందుకు మెగా కూటమి ఏర్పడింది.

బెంగళూరు సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. కూటమి కోసం 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని, తదుపరి సమావేశంలో కన్వీనర్‌ను ఎంపిక చేస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ శుక్రవారం బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొని రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ యాదవ్‌ను కలిశారని, విపక్ష కూటమి ఇండియా ముందుకు వెళ్లే మార్గం గురించి కూడా చర్చించినట్లు పలు వర్గాలు తెలిపాయి.