PM Modi on Chandrayaan-3: చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ అడుగుపెట్టి చరిత్ర సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చంద్రయాన్-3 విజయంతో తన జీవితం ధన్యమైందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత్ సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన వివరించారు. ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టమని మోడీ కొనియాడారు. బుధవారం సాయంత్రం చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3ని విజయవంతంగా ల్యాండ్ చేసినందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థను ప్రధాని అభినందించారు. చంద్రుని దక్షిణ ఉపరితలంపై చంద్రయాన్-3 చారిత్రాత్మక సాఫ్ట్ ల్యాండింగ్ అయిన వెంటనే ప్రధాని మోదీ ఇది “కొత్త శకానికి నాంది” అని అన్నారు. అమృత కాలంలో ఇది తొలి ఘన విజయమన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు ఈ విజయం కోసం ఎదురుచూశారని, ప్రతి ఇంట్లో సంబరాలు జరుపుకుంటున్నారని మోడీ వెల్లడించారు. ఈ గర్వించదగిన సమయంలో తాను కూడా దేశ ప్రజలతో కనెక్ట్ అయ్యానని ప్రధాని మోడీ అన్నారు. మిషన్‌ను విజయవంతం చేసిన ఇస్రోలోని శాస్త్రవేత్తల బృందాన్ని కూడా ఆయన అభినందించారు.
Read Also: Chandrayaan-3: చరిత్ర సృష్టించిన భారత్.. చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతం
“ఇంతకు ముందు ఏ దేశమూ అక్కడికి (చంద్రుని దక్షిణ ధృవం) చేరుకోలేదు. మన శాస్త్రవేత్తల కృషితో మనం అక్కడికి చేరుకున్నాము” అని ప్రధాని అన్నారు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశామన్నారు. మొదట్లో పిల్లలకు చంద్రుడు చాలా దూరం అనే చెప్పేవారని .. కానీ ఇప్పడు చంద్రుడిపై పర్యటన చేయొచ్చని ఆయన అన్నారు. ప్రస్తుతం బ్రిక్స్ సమ్మిట్‌కు హాజరవుతున్న ప్రధాని మోదీ.. తాను దక్షిణాఫ్రికాలో ఉండవచ్చని, అయితే తన హృదయం ఎప్పుడూ చంద్రయాన్ మిషన్‌పైనే ఉందని అన్నారు. “ఈ అపూర్వమైన ఫీట్ కోసం ఇస్రో, దాని శాస్త్రవేత్తలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన వర్చువల్ ప్రసంగంలో పేర్కొన్నారు. చంద్రయాన్ 3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత భారతదేశం అంతటా సంబరాలు మిన్నంటాయి.