Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!

  • సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా..
  • చట్టపరంగా న్యాయపోరాటం చేయడంలో తప్పేమీ లేదు: దానం నాగేందర్
Danam Nagender

Danam Nagender

Danam Nagender: ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. తన ఎమ్మెల్యే అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆయన అన్నారు. చట్టపరంగా ప్రయత్నం చేయడంలో ఎలాంటి తప్పు లేదని, అందుకే న్యాయపోరాటం చేశానని అన్నారు.

సుప్రీంకోర్టు మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పిందని దానం నాగేందర్ తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని, మళ్లీ ప్రజల మధ్యకు వెళ్తానని చెప్పారు. తాను నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నానని, ఇకపై కూడా ప్రజాక్షేత్రంలోనే తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నకు దానం నాగేందర్ స్పందించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత ఇస్తానని చెప్పారు. అప్పటి పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేశానని, ఇప్పుడు కూడా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

బీఆర్ఎస్‌పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ ప్రజలకు ఎవరు అండగా ఉన్నారో తెలుసని పేర్కొన్నారు. ఖైరతాబాద్ ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా భావించే వ్యక్తినని చెప్పారు. తాను గెలిచినా, ఓడినా ఖైరతాబాద్ ప్రజలు తనతోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. గతంలో ఒకసారి ఉప ఎన్నికలో ఓడిపోయానని దానం నాగేందర్ గుర్తుచేశారు. అయితే ఆ తర్వాత తనకు రాజకీయంగా ప్రమోషన్ కూడా వచ్చిందని అన్నారు. ఖైరతాబాద్‌లోనే ఉండాలని, ఢిల్లీకి వెళ్లొద్దనే ఉద్దేశంతో తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని వ్యాఖ్యానించారు. తాను ఎంపీగా పోటీలో ఉన్నప్పుడు కిషన్ రెడ్డి భయపడ్డారా.? లేదా.? అన్నది ప్రజలకే తెలుసని అన్నారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలే పునరావృతమవుతాయని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. అయితే తాను ప్రస్తుతం ఎలాంటి రాజకీయాలు మాట్లాడటం లేదని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు మార్గం సుగమమైన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.