Madhya Pradesh: తరాలు మారినా మానుషుల్లో మార్పు ఇసుమంతైనా లేదు. ఇంకా కులమతాలు పట్టుకుని వేలాడుతున్నారు. దేశంలో నలుమూలలా ఇంకా కులవివక్ష కోరలు విప్పి బుసలు కొడుతూనే ఉంది. దళిత కులానికి చెందిన ఓ యువకుడు పెళ్లి సందర్భంగా గుర్రం ఎక్కడం, ఊరేగింపుగా వెళ్లడం అగ్రవర్ణాల వారు జీర్ణించుకోలేకపోయారు. అంతే వరుడిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Read Also: Air India Flight: రష్యాలో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్
మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో సోమవారం సాయంత్రం దళిత వరుడి పెళ్లి ఊరేగింపుపై గుర్రపు స్వారీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో రాళ్లు రువ్వారు. రెండు పోలీసు బృందాలు జోక్యం చేసుకున్న తర్వాత కూడా రాళ్లు రువ్వడం కొనసాగింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. దాడిలో పాల్గొన్న ఓబీసీ వర్గానికి చెందిన 50 మంది నిందితులపై కేసు నమోదు చేశామని, 20 మంది పేర్లను నమోదు చేసినట్లు ఛతర్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అమిత్ సంఘీ తెలిపారు. వరుడు సుమారు 50 మందితో కలిసి ఛతర్‌పూర్ జిల్లాలోని చౌరాయ్ గ్రామం నుంచి సాగర్ జిల్లా షాఘర్‌లోని వధువు ఇంటికి సోమవారం సాయంత్రం బయలు దేరాడు. గుర్రంపై వస్తున్న వరుడి ఊరేగింపును గ్రామస్థుల బృందం అడ్డుకునేందుకు ప్రయత్నించింది. వరుడిని గుర్రంపై నుంచి దిగాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. అతను దిగడానికి నిరాకరించడంతో, కోపోద్రిక్తులైన ప్రజలు ఊరేగింపుపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు.
Read Also: Nepal PM Prachanda: సరిహద్దు సమస్య పరిష్కారానికి నేపాల్, భారత్ చర్చలు జరపాలి..
ఎస్పీ నేతృత్వంలో పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ రాళ్లు రువ్వడం మాత్రం కొనసాగింది. పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నంలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. పోలీసు బృందాలు కొన్ని గంటల తర్వాత జనాన్ని చెదరగొట్టగలిగాయి. ఊరేగింపుకు పోలీసులు భద్రత కల్పించారు. ఆ ఊరేగింపు అర్థరాత్రి గమ్యస్థానానికి చేరుకుంది. నిందితులపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (దౌర్జన్యాల నిరోధక) చట్టం-1989.. భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపినట్లు ఎస్పీ అమిత్ సంఘీ తెలిపారు. గ్రామంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఫిబ్రవరిలో కూడా జిల్లాలో ఇదే విధమైన సంఘటన జరిగింది. ఒక కానిస్టేబుల్ పెళ్లికి గుర్రపు స్వారీ చేయకుండా అడ్డుకున్నారు. అతని ఊరేగింపుకు పోలీసు రక్షణ కూడా ఇవ్వబడింది. 100 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు.
