Dale Steyn React on Cape Town Pitch: కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. కేవలం ఒకటిన్నర రోజుల్లో ఇరు జట్ల మధ్య 107 ఓవర్లు మాత్రమే పడ్డాయి. కేప్ టౌన్ పిచ్ మ్యాచ్ ప్రారంభం నుంచే ప్రమాదకరంగా మారింది. చాలా బంతులు బ్యాట్స్‌మెన్ పైకి వచ్చి ఇబ్బందులకు గురి చేశాయి. తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో ఐడెన్ మార్‌క్రమ్ మినహా ఎవరూ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్‌గా ఇది నిలిచిపోయింది. దీంతో కేప్ టౌన్ పిచ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ పిచ్‌పై దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇలాంటి పిచ్‌ను తయారు చేయడం వల్ల అంతర్జాతీయ క్రికెట్‌లో తమ దేశంపై విమర్శలు వస్తున్నాయని డేల్ స్టెయిన్ ఆవేదన వ్యక్తం చేశారు. సిడ్నీ, పెర్త్ పిచ్‌లలో పగుళ్లు ఉన్నా.. అక్కడ 4-5 రోజుల వరకు మ్యాచ్ సాగుతుందని.. కనీసం ఒక్క క్రాక్ లేకుండా మ్యాచ్ ముగియడం వల్ల ఏం లాభం అని విమర్శించాడు. ‘పిచ్‌పై పగుళ్లు వస్తే మేం ఎందుకు భయపడతాం?. సిడ్నీ, పెర్త్ పిచ్‌లపై పగుళ్లు ఉంటాయి. ఆ పగుళ్ల మధ్య కారును కూడా పార్క్ చేయొచ్చు. అయినా కూడా ఆ పిచ్‌లపై మ్యాచ్‌లు 4-5 రోజుకు వెళ్తాయి. కనీసం ఒక్క క్రాక్ లేకుండా.. మ్యాచ్ ఇంత వేగంగా ముగియడం వల్ల ఏం లాభం. సమయం గడిచే కొద్దీ పిచ్‌లో మార్పులు రావాలి. రెండు రోజుల్లోపే మ్యాచ్ ముగిస్తే.. దానిని టెస్టు అని ఎలా అంటాం?. ఈ టెస్ట్ మ్యాచ్ అర్ధంలేనిది’ అని ఎక్స్‌లో పేర్కొన్నాడు.
Also Read: Kapil Dev Birthday: కపిల్ దేవ్ బర్త్ డే.. రజనీకాంత్ ‘లాల్ సలామ్’ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్!
రెండో టెస్టు మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. ‘ఇది కూడా క్రికెట్ పిచే, ఆడింది మ్యాచే. ఈ పిచ్‌పై ఏం జరిగిందో అందరం చూశాం. మ్యాచ్ రిఫరీలకు, ఐసీసీకి ఏం జరిగిందో తెలుసనుకుంటున్నా. ఈ పిచ్‌కు ఏ రేటింగ్ ఇస్తారు?. ఐసీసీ, మ్యాచ్ రిఫరీలు తటస్థంగా ఉండాలి. ఇక నుంచైనా భారత పిచ్‌లపై నోరుపారేసుకోవడం ఆపేయండి’ అని రోహిత్ అన్నాడు. కేప్‌టౌన్‌లో విజయంతో సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకోవడం ఇది రెండోసారి మాత్రమే. 2010/11 సీజన్‌లో ఎంఎస్ ధోనీ ఈ ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్.